సెంటిమెంట్ కు కాంగ్రెస్ జై

April 01, 2020

ఎన్నిక‌ల‌కు ఎదురు ఈదుతున్న కాంగ్రెస్ పార్టీ త‌న మ‌స్తిస్కానికి ఇప్పుడు బాగానే ప‌ని పెడుతున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టిదాకా ఉత్త‌ర భార‌తం... అది కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అమేథీ, రాయిబ‌రేలీ సీట్ల నుంచే పోటీ చేస్తున్న ఇందిరా గాంధీ ఫ్యామిలీ... దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ పొలిటిక‌ల్ ఎంట్రీకి అమేథీనే ఎంచుకుంది. ఇక సోనియా కూడా అమేథీ నుంచే త‌న పొలిటిక‌ల్ కెరీర్ ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత ప్ర‌స్తుత పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచే త‌న కెరీర్ ను ప్రారంభించారు. తాజాగా ఇప్ప‌డు రాజ‌కీయాల్లోకి దూసుకువ‌చ్చేస్తున్న ప్రియాంకా గాంధీ కూడా ఇక్క‌డి నుంచే బ‌రిలోకి దిగి త‌న పొలిటిక‌ల్ కెరీర్ ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేర‌కు పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప‌క్కాగానే స్కెచ్ గీసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయినా ఇప్పుడు ఇక్క‌డి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు క‌దా అంటారా? అయితేనేం... ఈ సారి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ... రెండు చోట్ల గెలిచినా ఒక సీటును వ‌దులుకోవాల్సిందే క‌దా. ఈ క్ర‌మంలో త‌మ కుటుంబానికి పెట్ట‌ని కోట‌గా ఉన్న అమేథీని వ‌దులుకుని వ‌య‌నాడ్ ఎంపీగా కొన‌సాగేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారు. అదేంట‌ని అడిగితే... ఉత్త‌రాదితో పాటు దక్షిణాదిలోనూ త‌మ కుటుంబ ప్రాతినిధ్యం ఉండాల‌ని భావిస్తున్నామ‌ని, దీని ద్వారా ద‌క్షిణాదికి కూడా గాంధీ ఫ్యామిలీ అండ‌ను ఇవ్వాల‌నుకుంటున్నామ‌ని, ఈ క్ర‌మంలోనే రెండు చోట్ల గెలిచినా వ‌య‌నాడ్ ఎంపీగానే కొన‌సాగుతాన‌ని, అమేథీకి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న ఇప్ప‌టికే చెప్పేశారు. ఈ దిశ‌గా జ‌రిగిన విశ్లేష‌ణ‌ల్లో ఆసక్తిక‌ర అంశం వెలుగు చూసింది. అదే ప్రియాంకా గాంధీ పొలిటిక‌ల్ ఎంట్రీకి అమేథీ సిద్ధం చేయ‌డం. ఈ మేర‌కు పక్కాగానే ప్లాన్ గీసిన త‌ర్వాతే.. రాహుల్ గాంధీ వ‌య‌నాడ్ లో నామినేష‌న్ వేశార‌ని కూడా తెలుస్తోంది.

త‌మ కుటుంబానికి అచ్చొచ్చిన అమేథీ నుంచే త‌న తండ్రి రాజీవ్ తో పాటు త‌ల్లి సోనియా, తాను కూడా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశామ‌న్న‌ది రాహుల్ భావ‌న‌గా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త‌న సోద‌రి రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి కూడా అమేథీని సిద్ధంగా ఉంచ‌డం కోస‌మే రాహుల్ వ‌యనాడ్ ను ఎంచుకున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అమేథీతో పాటు వ‌య‌నాడ్ లో నిల‌బ‌డ్డ రాహుల్ గాందీ... రెండు చోట్లా విజ‌యం సాధించ‌డం ఖాయ‌మేన‌ని చెప్పాలి. ఎన్నిక‌ల త‌ర్వాత అమేథీకి రాజీనామా చేసి... అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌లో ప్రియాంక‌ను బ‌రిలోకి దింపాల‌న్న‌ది రాహుల్ ప్లాన్‌గా తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆశాకిర‌ణంలా ప‌రిగ‌ణిస్తున్న ప్రియాంకా గాందీ కూడా అమేథీ నుంచే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌న్న మాట‌.