కాంగ్రెస్ నేతలకు మోదీపై ఎంత కసి ఉందంటే..

July 05, 2020

తమిళనాడులో కరుణానిధి, జయలలితలు ఉన్న కాలంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పటికీ అదే పరిస్థిత ఉన్నా అప్పుడు మరింత తీవ్రంగా ఉండేది. ఎంతలా.. అంటే, రెండు పార్టీలో ఏ నాయకుడు కానీ, కార్యకర్త కానీ తమ పిల్లల పెళ్లిళ్లు చేసినప్పుడో, ఇంకేదో శుభకార్యాల సమయంలోనే ప్రత్యర్థి పార్టీకి చెందినవారిని ఎవరినైనా ఆహ్వానిస్తే చాలు వారిపై వేటు పడేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. బీజేపీ, మోదీపై ఉన్న కోపాన్ని సామాన్యులపై చూపిస్తోంది.
తాజాగా నరేంద్ర మోదీ పేరున్న టీషర్టు ధరించాడంటూ ఓ కార్మికుడిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం చీఫ్ శ్యామ్ పిట్రోడా సమావేశానికి ఏర్పాట్లు జరుగుతుండగా, ఓ కార్మికుడు ధరించిన టీషర్ట్ అక్కడున్న కొందరు నేతల కంట్లో పడింది.
ఆ టీషర్ట్ పై నరేంద్ర మోదీ పేరు ప్రచురించి ఉండడంతో వాళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. 2018లో మోదీ బార్మర్ లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పంచిన టీషర్ట్ అది. దానిపై ఆనాటి వివరాలన్నీ ముద్రించారు. ఆ టీషర్ట్ ను ధరించి రావడమే ఆ కార్మికుడు చేసిన నేరమైంది. తమ పార్టీ ఆఫీసులో ప్రత్యర్థి పార్టీ టీషర్టు ధరించడం కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. కొందరు నేతలు ఆయన్ను కొట్టడానికి వెళ్లారట. చివరకు ఇంకొందరు నేతలు జోక్యం చేసుకుని ఆ కార్మికుడిని అక్కడి పనుల నుంచి తొలగించి బయటకు పంపించేశారట.