కానిస్టేబుల్ పెళ్లి గోల... వైరల్ అయ్యింది

August 03, 2020

కానిస్టేబుల్ గా పని చేస్తున్నానంటే పెళ్లికి పిల్లను ఇవ్వట్లేదన్న ఆవేదనతో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన చార్మినార్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే సిద్ధాంతి ప్రతాప్ తీరు సంచలనంగా మారటం తెలిసిందే. తన రాజీనామా లేఖను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు పంపిన ఆయన తీరు అటు మీడియాలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.
ఆసక్తిగా డిపార్ట్ మెంట్లోకి వచ్చినా.. ఇక్కడి పరిస్థితులు.. పెళ్లికి పిల్లను ఇవ్వకపోవటం లాంటి కారణాలతో కానిస్టేబుల్ జాబ్ కు రిజైన్ చేసినప్పటికీ.. ఉన్నతాధికారుల ఆమోదం పొందకపోవటంతో నిమజ్జనం వేళ.. విధి నిర్వహణలో పాల్గొన్నారు.
పదోన్నతల విషయంలో ప్రతాప్ లేవనెత్తిన అంశంపై పలువురు కానిస్టేబుళ్లు అతనికి మద్దతు పలుకుతున్నారు. కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరితే కెరీర్ ఖతమే అన్నట్లు పలువురు పోలీసులు ఫీల్ అవుతున్న పరిస్థితి. తన రాజీనామా లేఖతో పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారిన ప్రతాప్.. కీలకమైన నిమజ్జనం వేళ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో పాల్గొన్నాడు.
ఉన్నతాధికారుల నుంచి తన రాజీనామాకు అనుమతి లభించకపోవటంతో డ్యూటీ చేసినట్లు అతను పేర్కొన్నాడు.  తన రాజీనామా మీద జరుగుతున్న ప్రచారంతో పాటు.. కొందరు ఉన్నతాధికారుల కౌన్సెలింగ్ తో తన రాజీనామా మీద పునరాలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.