జగన్ ఇసుక దెబ్బ - వైసీపీకే బూమ్ రాంగ్

May 25, 2020

జగన్ కావాలి, జగన్ రావాలి అని నినదించి, నమ్మి... దొరికిన వాహనం పట్టుకుని సొంతూరికి పోయి ఫ్యానుకు ఓటేసొచ్చిన ఓ వర్గం... ఇపుడు జగన్ పేరెత్తితే కారాలు మిరియాలు నూరుతోంది. ఇంతకీ ఆ వర్గం ఏంటో తెలుసా... నిర్మాణ రంగం కూలీలు. అవును.... నిర్మాణ రంగంలో దినసరి కూలీపై బతికేవాళ్లంతా జగన్ రావాలని కోరుకున్న మాట నిజమే. దానికి అనేక కారణాలున్నాయి. జగన్ ఇచ్చిన నవరత్నాలు, ఇతర హామీల ప్రభావం కావచ్చు. చంద్రబాబు ఇచ్చేవన్నీ ఇచ్చాడు. ఇతను ఇంకా ఇస్తాడేమో అని ఆశ కావచ్చు. ఏదైనా గానీ ఆ రంగంలో జగన్ కు గట్టి మద్దతు లభించింది. కానీ ఇపుడు వారంతా జగన్ అంటే కోపంతో ఉన్నారు. దీని వెనుక పెద్ద కథే ఉంది.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ సరళతరం చేశారు. దోపిడీ నివారించడానికి ఉచిత ఇసుక అమలు చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే... కొత్త రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఇసుకది కీలక పాత్ర. అది రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఏ ఇబ్బంది కలిగించకూడదు అన్నది ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది. నిర్మాణ రంగానికి అనుబంధ రంగాలుఎక్కువ. ఇసుక ఖరీదు అయితే నిర్మాణ రంగం నెమ్మదిస్తుంది. నిర్మాణ రంగం పుంజుకుంటే దానికి అనుబంధంగా ఉండే సుమారు 65 రంగాల్లో పనిచేసే సుమారు కోటిన్నర మందికి ఉపయోగం.
అదెలాగంటే... ఇపుడు జగన్ వచ్చాక ఇసుక దొరకడం లేదు. ఇసుక పాలసీ తెచ్చి ధర పెట్టారు. దీనివల్ల ఇసుక ధర అమాంతంగా పెరిగింది. పైగా వెంటనే ఇసుక అందుబాటులో కూడా ఉండటంలో లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు ఆగిపోయాయి. లక్షలాది మంది కూలీలు పూటగడవక నరకం చూస్తున్నారు. చివరకు నెల అయినా పని దొరక్కపోవడంతో వారంతా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఎపుడైతే నిర్మాణాలు ఉండవో... ఒక ఇంటికి అవసరమయిన అన్ని రకాల వస్తువులు కొనుగోళ్లు ఆగిపోతాయి. వాటిలో పనిచేసేవారు ఉపాధి కోల్పోతారు. వ్యాపారాలు పడిపోతాయి. రాష్ట్ర ఆదాయమూ తగ్గుతుంది. ఒక ఇల్లు కడితే ఇటుక, బండలు, సిమెంటు, ట్రాన్స్ పోర్ట్, హార్డ్ వేర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్, సివిల్ ... ఇలా అన్ని రంగాల్లో వ్యాపారం ఉపాధి తక్షణం ఆగిపోతుంది. ఇపుడు ఏపీలో ఇదే సీన్. ఉపాధి లేక, వ్యాపారం లేక కోటి మందికి పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యమంత్రి, అతని టీంకి అవగాహన లేక రాష్ట్రం తిరోగమనంలో ఉంది. తీవ్ర ఇబ్బందికి గురవుతోంది. దీంతో ఏపీలో అత్యధికులు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అటు వ్యవసాయం లేక, వర్షాలు లేక కరవు విలయతాండవంతో వ్యవసాయ రంగంలో పనులు లేవు. ఇసుక వల్ల నిర్మాణ రంగం కుదేలు. మొత్తంగా ఏపీలో సగం మంది ఉపాధి కోల్పోయి ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఎపుడు చక్కబడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.