తెచ్చిన రెండో రోజే జగన్ ను డ్యామేజ్ చేశాడు

May 31, 2020

కీలక స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలి. అందునా అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట చాలా కీలకంగా మారుతుంది. విషయం ఏదైనా.. ఉన్నది ఉన్నట్లు కాకుండా తమకు తోచినట్లుగా.. చెప్పే  మీడియా.. సోషల్ మీడియాలు పెరిగిపోయిన వేళ.. తొందరపాటు అస్సలు పనికి రాదు. సమయం.. సందర్భం లేకుండా మాట్లాడే మాటలతో కొత్త తలనొప్పులు గ్యారెంటీ. తాజాగా ఏపీ రాష్ట్ర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ వి. కనగరాజ్ వ్యాఖ్యలు ఇదే తీరుతో ఉన్నాయి.
తాజాగా ఆయన అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల షురూ అయి.. మధ్యలో ఆగిన పురపాలక.. పంచాయితీ.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ గురించి తెలియజేశారు. నోటిఫికేషన్ జారీ కావటం.. మధ్యలో ఎన్నికల్ని ఆపటం లాంటి అంశాల మీద అవగాహన కలిగించారు. కొత్తగా పదవిని చేపట్టిన వారికి ఇలాంటివి తప్పవు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సందర్భంగా జస్టిస్ కనగరాజ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి.
స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నరి్వహించినా సన్నద్ధులై ఉండాలన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. విడిరోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం తప్పు కావు. కరోనా లాంటి అసాధారణ పరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలు సరికావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రస్తావన తీసుకురావటం వల్ల ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తప్పవంటున్నారు. కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. వాటిని ఎలా తగ్గించాలన్నది అర్థం కాక కిందామీదా పడుతుంటే.. అలాంటివేళ.. ఎన్నికల ప్రస్తావన తీసుకురావటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఏరికోరి తీసుకొచ్చిన పెద్ద మనిషి.. తన మాటలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పడేసేలా ఆయన మాటలు ఉన్నట్లు చెప్పక తప్పదు. ఎన్నికల్ని నిర్వహించాలి కానీ.. కరోనా వేళ ఎంతమాత్రం కాదన్న విషయం కనగరాజ్ సారుకు తెలీకపోవటం ఏమిటి?