ఏపీలో పరిస్థితి చేయిదాటిందా? 

June 02, 2020

కరోనా తీవ్రత వల్ల ఎన్నికలు వాయిదా వేస్తే ఇగోకు పోయి కరోనా తీవ్రతనే దాచిపెట్టడానికి ప్రయత్నం చేసి ఏపీ ప్రభుత్వం విపలమైంది. చివరకు ఇపుడు జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తోంది. వేర్వేరు దేశాల్లో పనిచేస్తున్న చాలామంది ఏపీలో వారి ఇళ్లలో ఉంటారు. తాజాగా ఈరోజు విజయవాడలో ఒక కేసు నమోదైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. 

విజయవాడలో కరోనా వెలుగుచూడటంతో పోలీసులు బాధితుడి ఇంటి చుట్టు 3 కిలోమీటర్ల పరిధి మేర జనాలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండమని సూచనలు చేశారు. అతను ఎరిని కలిశారు అన్న సమాచారాన్ని ఆరాతీస్తున్నారు. అతనితో పాటు కారులో ప్రయాణించిన మరో ముగ్గురు ఆస్పత్రికి రావాలని పిలుపునిచ్చారు. కాలనీలో అందరికీ సాధారణ పరీక్షలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కేసుతో విజయవాడలో 144 సెక్షన్ విధించారు.  

ఏపీ డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ రాత్రి 9 గంటల వరకు మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించినా ప్రజలు ఎవరూ  ఆ తర్వాత కూడా బయటకు రావద్దని కోరారు. మరో రెండు రోజుల కర్ఫ్యూ పొడిగించే అవకాశాలు ఏపీ స్థాయిలో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ దీని గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. ప్రభుత్వ సూచనలు పాటించి ఎవరికీ జబ్బు అంటకుండా చూడాలని, మీ నిర్లక్ష్యంతో ఇతరులకు వ్యాధి వ్యాపిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. 

ఇదిలా ఉండగా... ఏపీలో చాలా కేసులు బయటపడటం లేదు. ఇటీవల చాలామంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికే కాదు... దేశంలో అన్ని రాష్ట్రాల్లో వచ్చారు. కానీ ఏపీలో మాత్రం ఆ వివరాలు వెల్లడి కావడం లేదు. ప్రభుత్వం ఎందుకో సమాచారం పూర్థిస్థాయిలో బయటపెట్టడం లేదు. ఏది ఏమైనా... ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండటం, శుభ్రత పాటించడం, ప్రభుత్వాల సూచనలు వినడం ద్వారా సమాజాన్ని కాపాడుకోవచ్చు.