తన మార్కు చూపిన జగన్

August 03, 2020

మహానగరాలు లేవు. ఎన్నారైల నుంచి వ్యాపించలేదు. మర్కజ్ వల్ల ప్రభావం ఉన్నా అది కూడా తమిళనాడు అంత ఏమీ లేదు. కానీ ఏపీలో సమర్థంగా అరికట్టాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులే కరోనాను సక్సెస్ ఫుల్ గా వ్యాప్తి చేస్తున్నారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల పుట్టలు పగులుతున్నాయి.  కొత్తగా ఏపీలో కొత్తగా 61 పాజిటివ్ కేసుల నమోదు కావడంతో రాష్ట్రంలో కేసులు వెయ్యి మార్కు దాటాయి. ఇప్పటివరకు 1016 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. నిన్ననే మృతుల్లో తెలంగాణను దాటేసిన ఏపీ ఈరోజు కొత్త మరణాలతో కలిపి 31 కి చేరింది. ఇంతవరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 19 శాతం కంటే తక్కువ.

అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే... ఇంతవరకు కరోనా అంటని శ్రీకాకుళంకు జిల్లాకు కొత్త కేసులు రాకుండా చేయడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. కరోనా లేకుండా ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రకు వ్యాపింపజేశారు. కరోనా లేదు లేదు అంటూ పట్టించుకోవడం మానేయడంతో జిల్లా బోర్డర్లను క్లోజ్ చేయడం, తనిఖీ చేయడంలో జాగ్రత్త లేకపోవడంతోనే ఇక్కడ కరోనా సోకింది. అంతేగాకుండా ఈ జిల్లాల నాయకులు ఇతర జిల్లాల్లో అనుచరులతో పాటు వెళ్లి తిరిగి రావడం, ఇతర జిల్లాల నాయకులను ఈ జిల్లాలకు రానివ్వడం, స్పీకర్ తమ్మినేని మాత్రమే కాకుండా పలువురు వైకాపా నేతలు జిల్లాలో కరోనా లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాలతో శ్రీకాకుళం కూడా కరోనా బారిన పడింది. 

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని అడ్డుకోకపోతే మొదటి నష్టం ప్రజలకి, ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటుకు తప్పదు. ర్యాలీలు, సమావేశాలు, దానధర్మాలు జాతలా చేయడం వంటివి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సూళ్లూరుపేట నేత మరో ర్యాలీ, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే... ఇలా ఒకరేటిమి అందరూ నిర్విరామంగా కరోనా వ్యాప్తికి కృషి చేస్తున్నారు.