చైనీయులు మానత్వాన్ని మర్చిపోయారా?

August 13, 2020

పిశాచితో పోరాడుతున్నామంటూ చైనా అధినేత చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లే చైనాలో తాజా పరిస్థితి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉండే ఆ దేశంలో ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అత్యవసర పరిస్థితి నెలకొంది. యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న వేళ.. ఎలా అయితే ఒక గంభీరమైన పరిస్థితులు ఉంటాయో ఇంచుమించు అలాంటి పరిస్థితులే ప్రస్తుతం చైనాలో ఉన్నాయి. మార్కెట్లు వెలవెలపోవటమేకాదు.. ఇళ్లల్లో నుంచి చైనీయులు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారట.
అంతేనా.. బజారుకు వచ్చినా తమ పని తాము చేసుకొని వడి వడిగా ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో..చైనాలోని వివిధ నగరాల్లోని రోడ్లు మొత్తం బోసిపోతున్నాయి. ట్రాఫిక్ రద్దీతో ఉండే రహదారులు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ కరోనా వైరస్ తమను పట్టేస్తుందన్న భయాందోళనలకు చైనీయులు గురి అవుతున్నారు. ఇప్పుడా దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇలాంటివేళ.. చైనీయుల్లో మానవత్వం మంటకలిసిపోయిందన్న మాట వినిపిస్తోంది. దీనికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా వైరస్ కు జన్మస్థానమైన వూహాన్ లో రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి మరణించాడు. అతడెందుకు మరణించాడన్న విషయంపై స్పష్టత లేకున్నా.. అతడికి ఏమైందన్న విషయాన్ని దగ్గరకు వెళ్లి చూసేందుకు సైతం ఎవరూ సాహసించలేదు. అంతలా భయం చైనీయుల్ని పట్టేసిందని చెబుతున్నారు. కాసేపటికి ఒక ఫోటో జర్నలిస్టు తీసిన ఫోటో మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రావటంతో పోలీసు యంత్రాంగం స్పందించి వైద్యుల్ని అక్కడకు పంపింది. ఆ డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. కరోనా భయంతోనే తాము మృతదేహం వద్దకు వెళ్లలేదని అక్కడి వారు చెబుతున్నారు. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి కరోనా వైరస్ సోకి ఉంటే.. ఆ వైరస్ తమను సోకుతుందన్న భయంతోనే దగ్గరకు వెళ్లలేదంటున్నారు. ఇలాంటి ఉదంతాలు చైనాలో ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. అయితే.. చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయారన్న విషయంపై స్పష్టత రాకున్నా.. అతడు మరణించిన ప్రదేశాన్ని మాత్రం రసాయనాలతో శుభ్రం చేయటం అక్కడి వారిలో మరింత భయాందోళనలకు గురి చేసింది.