సైన్యానికీ కరోనా..

August 05, 2020

ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్, తన పుట్టిల్లు అయిన చైనాలో మాత్రం శాంతించింది. దాదాపు మూడున్నర వేల మందిని పొట్టనబెట్టుకున్న అనంతరం కరాళనృత్యాన్ని ఆపేసింది. అయితే, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, అమెరికాలో మాత్రం ప్రభావం తగ్గలేదు. యూరప్ కంట్రీస్‌లోనూ విలయతాండవం చేస్తోంది. చైనాకు పొరుగునే ఉన్న ఉత్తర కొరియాలోనూ కొవిడ్-19 విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నియంతృత్వ పాలన కారణంగా ఆ దేశ వార్తలేవీ బయటకు పొక్కడం లేదు. ఆ దేశంలో కరోనా వైరస్ సోకిందని ఓ వ్యక్తిని అక్కడి అధికారులు కాల్చి చంపేశారన్న వార్త ఇటీవల గుప్పుమంది. అది నిజమనే ప్రపంచదేశాలన్నీ నమ్ముతున్నాయి. ఎందుకంటే, అక్కడి ప్రభుత్వ పద్ధతులు అత్యంత క్రూరంగా ఉంటాయి. పైగా చైనాను ఆనుకునే ఉంది కాబట్టి వైరస్ వ్యాపించకుండా ఉండదన్నది వాదన. నిప్పును దాచినా పొగ దాగదన్నట్లు, ఉత్తర కొరియా ఎంత అణిచిపెట్టాలని చూసినా ఆ దేశంలో కరోనా విజృంభణకు సంబంధించిన వార్తలు మాత్రం దాగడం లేదు.

ఉత్తర కొరియాలో కొవిడ్-19 పట్టపగ్గాల్లేకుండా విహరిస్తోందని, వేలమంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని దక్షిణకొరియాకు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు, మరో బాంబు కూడా పేల్చింది. ఆ వైరస్ సోకి ఉత్తర కొరియాలో 200 మంది సైనికులు చనిపోయారని తెలిపింది. ఈ విషయం విని ప్రపంచదేశాలు మరోమారు ఉలిక్కిపడ్డాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి వైరస్ సోకిందట. మరో 4 వేలమంది సైనికులకు కూడా కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో వారిని ప్రత్యేక చికిత్స కేంద్రాలకు తరలించారట. ఈ వార్తలేవీ బయటకు రాకుండా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తొక్కిపెట్టాడని దక్షిణ కొరియా వార్తాసంస్థ తెలిపింది.