ఫ్రీ గా తింటే కరోనా రాదా !!

August 07, 2020

కరోనా దెబ్బకు చికెన్.. మటన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మొన్నటి వరకూ చికెన్ కు నో చెప్పినోళ్లు చాలామంది మటన్ తినేందుకు మక్కువ చూపించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాన్ వెజ్ ను దాదాపుగా బంద్ చేసిన పరిస్థితి. దీంతో.. కోళ్ల వ్యాపారులు.. కోళ్ల ఫాంలో దారుణమైన నష్టాలకు లోనైన పరిస్థితి. కొందరైతే.. ఈ నష్టాల్ని భరించలేక.. వేలాది కోళ్లను మట్టిలో పూడ్చేయటం లాంటివి చేస్తే.. ఇంకొందరు మాత్రం ప్రజలకు ఉచితంగా పంచేయటం షురూ చేశారు.
చికెన్ తింటే కరోనా వ్యాపించదన్న విషయాన్ని ఎంత ప్రచారం చేసినా.. ప్రజలు మాత్రం వాటి జోలికి వెళ్లేందుకు ఇష్టపడని పరిస్థితి. చికెన్ కు కరోనాకు లింకు ఉందని తేలిస్తే కోటి రూపాయిలు నజరానా ఇస్తామన్నా ఫలితం శూన్యం. ప్రచారం ఎంతలా చేసినా.. ప్రయోజనం లేకపోవటం.. కోళ్లు ఉంటే.. నిత్యం వాటి మేతకు పెద్ద ఎత్తున పెట్టాల్సి పరిస్థితి.
ఈ నేపథ్యంలో చాలామంది ఫౌల్ట్రీ ఫాం యజమానులు కోళ్లను గ్రామాలకు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేస్తున్నారు. తాజాగా వెల్దుర్తి పట్టణానికి చెందిన ఒక పౌల్ట్రీ యజమాని తన దగ్గరున్న 5,300 కోళ్లను తీసుకొచ్చి ఉచితంగా పంచేసి వెళ్లిపోయారు. డబ్బులు పెట్టి కొనటానికి ముందుకు రాని ప్రజలు ఉచితంగా కోళ్లను పంచి పెడుతున్నారంటే మాత్రం ఎగబడి తీసేసుకొనటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పుడు ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చెర్వపూర్ గ్రామానికి చెందిన స్వామి అనే రైతు రెండు వేల కోళ్లను ఉచితంగా పంచేశారు. పనిలో పనిగా.. చికెన్ తింటే ఏమీ కాదని.. అనవసరమైన భయాల్ని వదిలేయాలని పిలుపునిస్తున్నారు. వ్యాపారులు చెప్పే మాటల్ని వింటున్న చాలామంది డబ్బులు పెట్టి కొనుగోలు చేయటానికి ఇష్టపడటం లేదు. అదే సమయంలో ఉచితంగా పంపిణీ చేస్తుంటే మాత్రం ఎగబడి తీసుకెళ్లిపోవటం విశేషం.