ప్యాసింజర్లకు రైల్వే శాఖ షాక్...

August 12, 2020

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. జన సమీకరణ ఎక్కువగా జరిగే అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జనజీవనానికి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ ...కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి. మన దగ్గర తక్కువ కేసులే అని లైట్ తీసుకోలేని స్థితిలో కేంద్రం మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

జనం ఎక్కువగా ఉండే రైళ్లు, బస్సులపై ఫోకస్ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచనలు జారీచేసింది. కరోనా ధాటికి ఇప్పటికే చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో...దాదాపు 100 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. తాజాగా, జనం తాకిడి తగ్గడంతో మరో 168 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా ధాటికి రైల్వే స్టేషన్లలో జనం తాకిడిని నియంత్రించేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచిన సంగతి తెలిసిందే.
కరోనా తీవ్రత వల్ల ప్రధాన రైళ్లకు జనం ఉండడం లేదని, అందుకే 168 రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. మార్చి  20వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 168 రైళ్లు రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. మార్చి 31 వరకు ఈ రద్దు నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. మార్చి 31 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు  మెసేజ్ ద్వారా  సమాచారం అందిస్తామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు, కరోనా వైరస్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారు రైల్వే కేటరిగంగ్ పనులు చేయకుండా చూడాలని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 169 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యసంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా ధాటికి మన దేశంలో ముగ్గురు మరణించారు.