దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఆ రెండు రాష్ట్రాలు

August 08, 2020

ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. మన దేశంలో కరోనా తీవ్రత తక్కువనే చెప్పాలి. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నానుడిని కరోనా విషయంలో చేసి చూపించాయి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు. 130 కోట్లకు పైనే జనాభా ఉన్న అతి పెద్ద దేశంలో ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయం తీసుకోవటం అంతే తేలికైన విషయం కాదు. అంతేనా.. అమెరికా.. బ్రిటన్.. చైనా మాదిరి భారత్ ఏమీ సంపన్న దేశం కాదు. ఇప్పటికి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు కోట్లల్లో ఉంటాయి. అయినప్పటికి ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు.. వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ అనే కీలక నిర్ణయాన్ని తీసుకొని మోడీ పెను సాహసమే చేశారు.
కొన్నిసార్లు అంతే..సాహసం చేసే వాడి వెంటే సుడి ఉంటుంది. ఆ విషయంలో మోడీకి మించినోడు ఉండదు. ఆయన తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లే ఫలితాలు వస్తున్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లాంటి దేశంలో కేవలం 1100 పాజిటివ్ కేసులు.. వాటిల్లో అత్యధికులు రానున్న వారంలో డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి ఉండటం.. కొత్త కేసులు నమోదు అవుతున్నా.. అమెరికాతో సహా యూరోపియన్ దేశాల్లో మాదిరి తీవ్రత లేకపోవటానికి కారణం లాక్ డౌన్ అని చెప్పక తప్పదు.
లాక్ డౌన్ అమలవుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1070కు పైగా కేసులు నమోదైతే.. అందులో దగ్గర దగ్గర 35 శాతం కేసులు కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. అందులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే.. రెండో స్థానంలో కేరళ నిలిచింది.
మహారాష్ట్రంలో ఇప్పటికి 215 పాజిటివ్ కేసులు నమోదైతే.. కేరళలో 210 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో ప్రభావం తక్కువగా ఉందన్నది మర్చిపోకూడదు. మరణాల విషయంలోనూ మహారాష్ట్రలోనే ఎక్కువ ఆ రాష్ట్రంలో ఎనిమిది మరణాలు చోటు చేసుకోగా.. తర్వాతి స్థానం గుజరాత్ నిలిచింది. ఆ రాష్ట్రంలో ఆరు మరణాలు చోటు చేసుకోగా.. కర్ణాటకలో మూడు.. మధ్యప్రదేశ్ .. ఢిల్లీ.. జమ్ముకశ్మీర్.. పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో రెండేసి చొప్పున మరణాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో అధికారికంగా ఒక మరణాన్ని వెల్లడించినా.. మరొకటి కొద్ది గంటల్లోనే ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో చోటు చేసుకున్న ఒక మరణం కూడా కరోనా వైరస్ సోకి.. చికిత్స పొందుతూ కాదు.. సదరు బాధితుడు మరణించిన తర్వాతే అతనికి కరోనా సోకిందన్న విషయం బయటపడటం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉంది. పాజిటివ్ కేసుల నమోదులో దేశంలోనే రెండో స్థానంలో కేరళలో ఇప్పటివరకూ ఒక్క మరణం మాత్రమే చోటు చేసుకుంది. ఇక.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మరణించిన వారిలో అత్యధికులు పెద్ద వయస్కులే కావటం గమనార్హం.