జగన్ టైం బాగోలేదా?

June 06, 2020

కరోనా దెబ్బకు ప్రపంచంలో అందరి తలరాతలు మారిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. కంటికి కనిపించని ఈ భయం... ప్రతి కంటికి కనిపించే నష్టాన్ని సృష్టిస్తోంది. దేశాలకు దేశాలు హాహాకారాలు చేస్తున్నాయి. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో మన ఏపీ ప్రభుత్వం కరోనా వల్ల కలిగిన నష్టంతో విలవిలలాడుతోంది. కరోనా కారణంగా జగన్ సర్కారుకు కలిగిన నష్టానికి కారణాలు వెతికితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.
కరోనా పుణ్యమా అని ఏపీలో స్థానిక ఎన్నికల్ని ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ.. ఏపీ ఎన్నికల కమిషనర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. సకాలంలో స్థానిక ఎన్నికల్ని నిర్వహిస్తే దక్కే భారీ గ్రాంట్ రాకుండాపోయింది. టైంకి స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేసిన పక్షంలో రూ.5 వేల కోట్లను కేంద్రం ఏపీకి విడుదల చేసేది. ఆ నిధుల్ని సొంతం చేసుకోవటం కోసమే జగన్ అంత ఆఘమేఘాల మీద ఎన్నికలను నిర్వహించబోయింది. జగన్ టైం బ్యాడ్... ఎన్నికలు వాయిదా పడితే... డబ్బులు శాశ్వతంగా రాకుండాపోయాయి. 
కేంద్రం నిబంధనల ప్రకారం... నిర్దేశించిన గడువు కంటే ముందే (మార్చి 31) స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు..కార్పొరేషన్లు.. గ్రామ పంచాయితీల ఎన్నికల్ని పూర్తి చేస్తే.. కేంద్రం నుంచి రూ.5 వేల కోట్ల మేర నిధులు వచ్చేవి  ఈ నెలాఖరు లోపు స్థానిక సంస్థల పాలన ఏర్పాటైతేనే ఆ అవకాశం. ఇపుడు అది చేజారిపోయింది.  సీన్ కట్ చేస్తే. ఎన్నికలు జోరుగా సాగుతున్న వేళ.. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటం ఏపీ సర్కారుకు షాకింగ్ గా మారింది. జగన్ నెత్తిమీద 5 వేల కోట్ల బండ పడింది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత.. స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని బాబు భావించారు. అనూహ్యంగా ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురుకావటం.. జగన్ ముఖ్యమంత్రి కావటం జరిగిపోయింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావన్న మాటతో హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్నో అంచనాలతో సాగుతున్న ఎన్నికల్ని.. కరోనా కారణంగా వాయిదా వేయటం ఏపీ సర్కారుకు భారీ నష్టం వాటిల్లిందన్న మాట వినిపిస్తోంది.