అమెరికా అల్లకల్లోలం !

August 11, 2020

అతిపెద్ద స్వయంకృతాపరాధం చేసిన అధ్యక్షుడిగా ట్రంప్  అమెరికా చరిత్రలో నిలిచిపోతారని అత్యధిక అమెరికన్లు భావిస్తున్నారు. ప్రపంచం చేత ఇన్నాళ్లు అగ్రరాజ్యం అనిపించుకున్న అమెరికా తాజాగా కరోనా బారిన పడిన విధం చూస్తుంటే త్వరలో ఆ హోదా కోల్పోయే పరిస్థితి వస్తోంది. ఇప్పటిే కరోనా రోగుల్లో లక్ష దాటిని ఏకైక దేశంగా రికార్డు నెలకొల్పింది. అత్యున్నత జీవన ప్రమాణాల కోసం అని అందరూ అమెరికా వైపు చూస్తారు. కానీ ప్రపంచంలో ఇటలీ, స్పెయిన్, ఇరాన్ తర్వాత అక్కడే మరణమృదంగం ఎక్కువగా మోగుతోంది. ఇది కేవలం ప్రజల ఆరోగ్యాన్నే కాదు... దేశ ఆర్థిక వ్యవస్థను పతనం వైపు నడిపిస్తోంది. డాలర్ ను శిఖరం నుంచి కిందకు దొర్లిస్తోంది. 

తన ఇగోతో.. తొలి మాసంలో కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలను నిర్లక్ష్యం చేసిన అధ్యక్షుడు ట్రంప్ దానికి స్వయంగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. అయితే, మూల్యం ఆయన చెల్లించుకుంటే సరిపోవడం లేదు. కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏ ఇరాన్ వంటి దేశంలోనో మరణాలు ఎక్కువ ఉన్నాయంటే జాలిపడొచ్చు. డబ్బుతో పోల్చినా, వైశాల్యంతో పోల్చినా, పవర్ పరంగా ... ఏ విధంగా చూసినా అన్ని అందుబాటులో ఉన్న అమెరికా సరైన సమయంలో తలచుకుని ఉంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగేది. కానీ ఇపుడు తప్పు జరిగిపోయింది. ఓ అంచనా ప్రకారం అమెరికాలో ఇది కొన్ని మిలియన్ల మందికి సోకుతుందని అంచనా వేస్తున్నారు.

తాజాగా ఈరోజు చికాగోకు చెందిన ఓ పసికందు కన్నుమూసింది. దీని గురించి ఇల్లినాయిస్ గవర్నర్ బేబి ప్రిట్జకర్ మాట్లాడుతూ చిన్నారి మరణం కలచివేసిందని కన్నీరు పెట్టారు. మరణంపై పూర్తి విచారణ జరుపుతామని ఇల్లినాయిస్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక న్యూయార్క్ లో పరిస్థితి ఘోరంగా ఉంది. న్యూయార్క్ లో ఇప్పటికే 517 మంది చనిపోవడం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెబుతుంది. అమెరికా వ్యాప్తంగా లక్ష 20 వేల కేసులు నమోదయ్యాయి. 2 వేల మంది పిట్టల్లా రాలిపోయారు. బాధాకరణమైన విషయం ఏంటంటే... ఇంత మందిని రక్షించడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, డెట్రాయిట్, న్యూ ఆర్లిన్స్ లలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 213 నగరాల మేయర్లు సదుపాయాలు కల్పించలేక చేతులు ఎత్తేశారు.  

 

తాజాగా అమెరికా హౌస్ స్పీకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కరోనా ఇక్కడ వ్యాపిస్తున్న తొలినాళ్లలో ట్రంప్ మాటలు, చర్యలు క్షమించరానివి అన్నారు. అసలు కరోనా ప్రభావాన్ని చాలా తక్కువగా తీసిపారేయడం వల్లే ఈరోజు అమెరికాకు ఈ దుస్థితి వచ్చిందని ఆమె ఆవేదన చెందారు. అతను నిర్లక్ష్యం నేడు వేల ప్రాణాలను బలిగొంటోందని విమర్శించారు.

కొసమెరుపు - ఏంటంటే... కరోనా శకం ముగిసిన తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఘోరమైన పతనాన్ని చూడబోతోంది. దాని తలచుకుంటేనే అమెరికన్లకు వెన్నులో వణుకుపుడుతోంది.