కరోనా సోకడంతో జీవితం సెటిలైపోయింది

August 15, 2020

సృష్టిలో కొన్ని విచిత్రాలు, వింతలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఇదొకటన్నమాట. అందరూ కరోనాతో కుమిలిపోతే ఓ అబ్బాయి, అమ్మాయి మాత్రం కరోనా పుణ్యమా అని సెటిలైపోయారు. ఈ విచిత్రం ఎక్కడో కాదు మన గుంటూరులో జరిగింది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట యువతికి కరోనా సోకింది. అలాగే ప్రకాశం జిల్లా పర్చూరు యువకుడికి కరోనా సోకింది. వీరిద్దరు చికిత్స కోసం గుంటూరులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరి బెడ్లు పక్కపక్కనే ఉన్నాయి. పెద్దగా లక్షణాలు లేవు. హుషారుగానే ఉన్నారు. దీంతో త్వరగా కోలుకున్నారు... కరోనా వార్డు అంటే ఎవరుంటారు. డాక్టర్లు, నర్సులు కూడా పెద్దగా ఉండరు. అలా వచ్చి ఇలా పోతారు.

ఖాళీగా బోర్ ఫీలవుతున్న వారిద్దరు మాటలు కలిపారు. ఒకరికొకరు నచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. విచిత్రంగా వాళ్లిద్దరి కులం కూడా ఒకటే. మనసులు కలిసిపోయాయి. రోగులు కాస్తా, ప్రేమికులుఅయిపోయారు.

చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన వారిద్దరు తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. పిల్లాడికి ఉద్యోగం ఉంది. అమ్మాయిది బీటెక్ పూర్తయ్యింది. ఇంకే కావాలి. వాళ్లిద్దరికి ఇష్టమైతే అంతకుమించి కావాల్సిందేముంది అనుకున్నారు పెద్దలు. ఇదేదో దేవుడి దీవెనలా ఉందనుకున్నారు. ఆలస్యం చేయకుండా వారి పెళ్లికి ఓకే చెప్పారు. ఈనెల 25న గుంటూరు జిల్లా పొన్నూరులోని గుడిలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కథ సుఖాంతం.  

అనేక కరోనా నెగెటివ్ వార్తల మధ్య ఈ వార్త ... ఎంతో హాయిగా అనిపిస్తోంది కదా. అందరినీ భయానక అనుభవాన్ని మిగిలిస్తున్న ఈ వ్యాధి వీరికి మాత్రం జీవితానికి సరిపడా జ్జాపకాలను మిగిల్చింది.