నిఖిల్ తో పాట పాడించిన జగన్ సర్కార్

August 06, 2020

కనిపించని శత్రువు.. కరోనా కాలంలో బతుకుతూ దానికి దొరక్కుండా  ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా బతకాలి అన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయటం కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్తగా నడుం బిగించింది. అందరికి తెలిసిన విషయాలే అయినా.. మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా.. అప్రమత్తతను పెంచేలా ఒక పాటను సిద్ధం చేయించింది. ప్రముఖ టాలీవుడ్ నటుడు.. యంగ్ హీరో నిఖిల్ తో ఒక పాటను సిద్ధం చేయించారు.

కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఏమేం చేయాలన్న విషయాన్ని ఈ పాటతో చెప్పించారు. కనిపించని క్రిమితో సమరం అంటూ ఏపీ సర్కారు సిద్ధం చేసిన ఈ పాటతో ప్రజల్లో మరింత అవగాహన పెంచేలా చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇవ్వగా.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పాటలో కనిపిస్తారు.

కాజల్ అగర్వాల్.. నిధి అగర్వాల్.. ప్రణీతా.. సుధీర్ బాబు.. పీవీ సిందు తదితరులు కనిపించే ఈ పాటలో లాక్ డౌన్ వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో.. అలాంటి జాగ్రత్తలే ఇప్పుడు తీసుకోవాలన్న సందేశాన్ని ఇస్తారు.

అంతేకాదు..  కరోనా తో దెబ్బ తిన్న మన జీవితాల్ని మళ్లీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని అర్థం వచ్చేలా ఈ పాటను రూపొందించారు. పట్టుసడలకుండా.. నిబ్బరం కోల్పోకుండా.. అలసట అన్నది లేకుండా కనిపించని క్రిమితో సమరం ఎలా సాగాలో ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేసింది ఏపీ సర్కారు.