​తెలుగు రాష్ట్రాలు సమానం... !

August 11, 2020

ఎందులో అని ఆసక్తిగా చూస్తున్నారా... ఈరోజు కోవిడ్ కేసుల లెక్క ఇరు రాష్ట్రాల్లో సమానంగా ఉంది. తెలంగాణలో ఈరోజు నుంచి కొత్త కేసులు ఉండకపోవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పింది జరగలేదు. కాకపోతే నిన్నటి కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. ​కొత్తగా తెలంగాణలో 16 కేసులు, ఏపీలో 16 కేసులు నమోదయ్యాయి. దేశంలో 678 కొత్త కేసులు వచ్చాయి. ఇవి నిన్నటి కంటే ఎక్కువ. అయితే. ఇది మహారాష్ట్ర, తమిళనాడు ప్రభావమే. ఈరోజు కేంద్రం విడుదల చేసిన దాని ప్రకారం దేశంలో కేసుల సంఖ్య 6412కి చేరింది. మరణాలు 199గా నమోదయ్యాయి.  మొత్తం కోలుకున్న వారి సంఖ్య 503 గా ఉంది. 146 ప్రభుత్వ ల్యాబ్స్, 67 ప్రైవేటు ల్యాబ్స్ లో దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.

ఏపీలో రెడ్ జోన్లు, కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటుచేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. ముందు పెద్దగా కేసులు నమోదు కాకుండా ఆలస్యంగా ఎక్కువ కేసులు నమోదై మొదటి స్థానంలో ఉన్న కర్నూలులో ఎక్కువ రెడ్ జోన్లు ఉన్నాయి. మొత్తం ఏపీలో కేసులు 381కి చేరాయి. 

మరోవైపు తెలంగాణలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తిని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈరోజు 16 కొత్త కేసులు నమోదు కాగా...మొత్తం కేసుల సంఖ్య 487కి చేరింది. మరణాలు, డిశ్చార్జి కేసులు తీసేయగా ఇంకా ఆస్పత్రిలో 430 మంది చికిత్స పొందుతున్నారు. 

మహారాష్ట్రలో కరోనా విపరీతంగా వ్యాపిస్తోంది. ఒక్క ముంబై నగరంలోనే ఈ ఒక్కరోజే 218 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. వీటితో కలిపి కేవలం ముంబై నగరంలోనే 993 కేసులున్నట్టు తేలింది. ముంబై మృతులు 64.