చిలుకూరు బాలాజీ గుడిలో అద్భుతం- కరోనా కట్టడికి సంకేతం

August 11, 2020

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఈ చరాచర లోకానికి అభయం ఇచ్చారా? అంటే అవుననే అంటున్నా పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు. కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ప్రపంచం దీని నుంచి విముక్తి ఎపుడో తెలియక సతమతం అవుతోంది. దేవుడిపై భారం వేసి ప్రార్థన చేస్తోంది. మన మొర దేవుడు ఆలకించాడా అన్నట్టు ఓ అద్భుతం జరిగింది. 

శ్రీ చిలుకూరి బాలాజీ ఆలయంలో కూర్మం ప్రత్యక్ష్యం అయ్యింది. కూర్మం (తాబేలు) సుందరేశ్వర స్వామి ఆలయం తలుపులు మూసి ఉన్నపుడు ప్రవేశించింది. అయితే, తలుపులు మూశాక కూర్మం లోపలికి వచ్చే మార్గమే లేదు. కానీ ఉదయానికల్లా అక్కడ కూర్మం ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని పరిశీలించిన  ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ ఆశ్చర్యం, సంతోషం వ్యక్తంచేశారు. ఇది లోకానికి శుభసూచకం అన్నారు. 

ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతాన్ని పంచిన మహాఘట్టంలో కీలక భూమిక వహించింది కూడా కూర్మమే. దేవతలు, అసురులు క్షీరసాగరాన్ని మధించడానికి ఉపయోగించిన పర్వతాన్ని మోసింది కూర్మమే. విష్ణుమూర్తి దశావతారాల్లో కూర్మావతారం ఒకటి. 

హిందూ ధర్మ పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండో అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారము ధరించి దానిని తన వీపుపై మోస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.

తాజాగా ప్రపంచం కనీవినీ ఎరుగుని కష్టం నేడు తలెత్తింది. ఇది మానవ యుగంలో ఒక కీలక దశ. ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి మానవ శక్తి చాలదు. ఈ దశలో మానవుడిని ఆశీర్వదించడానికి దైవం ఈ  రూపంలో సంకేతం పంపిందని రంగరాజన్ వివరించారు. అంటే కరోనా విషాన్ని సంహరించే అమృతం త్వరలో మనకు దొరకబోందనడానికి ఈ విశేష ఘటన ప్రధాన సంకేతం అని ఆయన విపులీకరించారు.