ఇండియాలో కరోనా కేసులు పెరిగాయి.. ఇపుడెన్ని అంటే...

August 13, 2020

ఒక వ్యాధి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడం అసాధారణమైన విషయం. కరోనా వేలాది మంది మనుషుల ప్రాణాలను బలిగొనడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా అనేక దుష్ప్రభావాలను నమోదు చేస్తోంది. కరోనా దెబ్బకు అనేక వ్యాపారాలు కుప్పకూలుతున్నాయి. చాలాకాలం ఇది మన దేశాన్ని తాకలేదు. చివరకు ఫిబ్రవరిలో మన దేశంలోనూ ఎంటరైంది.

మొదట కేరళలో మూడు కేసులు నమోదైనా వాటిని ఆ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొని నిలువరించింది. తర్వాత ఢిల్లీ, హైదరాబాదుల్లో మూడు కేసులు నమోదయ్యాయి. తర్వాత వరుసగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మనదేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య హాఫ్ సెంచరీకి చేరింది. కేరళలో మళ్లీ ఈ వ్యాధి విజృంభించింది. 12 మంది దీని బారిన పడ్డారు. కర్ణాటకలో  నలుగురికి ఇప్పటివరకు నిర్దారణ అయ్యింది. తెలంగాణలో మాత్రం ఒకే ఒక కేసు నమోదైనా అతను కోలుకుంటున్నారు. ఇంకా ఢిల్లీ తదితర ప్రదేశాల్లో మొత్తం 50 కేసులు నమోదయ్యాయి.

కేంద్రం కరోనా కట్టడికి అన్ని విధాల చర్యలు చేపట్టింది. ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతోంది. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లను మూసేశారు. కేరళ ఏడో తరగతి వరకు స్కూళ్లను మూసేసింది. ఇదిలా ఉండగా... చైనా, హాంకాంగ్, సింగపూర్, ఇటలీ, ఇరాన్ దీనికి పెద్ద ఎత్తున బాధిత దేశాలు. ఇరాన్ అల్లాడిపోతోంది. అమెరికాలో 500 మందికి సోకగా 24 మంది చనిపోయారు. వూహాన్ నగరంలో పుట్టి చైనాను అతలాకుతలం చేసిన కరోనా  వంద దేశాల్లో 1,13,000 మందికి ఇప్పటివరకు సోకింది. 4 వేల మరణాలు సంభవించాయి. కరోనాలో ఒకే ఒక సానుకూలత ఏంటంటే... ఈ వ్యాధి వచ్చిన వారికి బతికే ఛాన్సులు ఎక్కువ. కేవలం 2-6 శాతం మంది మాత్రమే మరణిస్తున్నారు. కానీ ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.