కరోనా పదంపై నిషేధం

August 07, 2020

కరోనా పేరు వింటేనే జనం బెంబేలెత్తుతున్నారు. తుర్కుమెనిస్తాన్ దేశంలో తాజాగా కరోనా అనే పదాన్ని నిషేధించారు. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో చర్చించడాన్ని కూడా నిషేధించింది. మీడియా వార్తల్లో, ఆరోగ్య శాఖ పంపిణీ చేసే సమాచార పత్రాల్లోనూ ఈ పదం కనిపించరాదని ఆదేశించింది. ప్రజలు ఎవరైనా కరోనా గురించి మాట్లాడితే, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం మఫ్టీలో సాధారణ దుస్తుల్లోనే ప్రభుత్వ ఏజెంట్లు ప్రజల మధ్య తిరుగుతున్నారు. రహస్యంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారన్నది గమనించడమే వీరి విధి. వైరస్, దాని వ్యాప్తి గురించి మాట్లాడితే, ఇక అంతే. ఇక వైరస్ గురించిన సమాచారం ఇక్కడి ప్రజలకు అంతంతమాత్రంగానే తెలుసు.
మరోవైపు తుర్కుమెనిస్థాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనాలు గుమిగూడడాన్నినిషేధించిన తుర్కుమెనిస్తాన్ రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు.
తుర్కుమెనిస్థాన్‌లో ప్రతిపక్షం ఉండదు.. ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. ప్రభుత్వ మీడియా మాత్రమే పనిచేస్తుంది. ఆ దేశాధ్యక్షుడు గుర్బాంగులీ బెర్దీముఖమెదోవ్‌దే మొత్తం అధికారం. ఆయనో నియంత. అక్కడ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలను విమర్శించే అవకాశం ఎవరికీ లేదు. తుర్కుమెనిస్థాన్ పాపులేషన్, జనసాంద్రత చాలా తక్కువ కావడం... దేశాధ్యక్షుడు విధించే నిబంధనలను తూచా తప్పకుండా పాటించే పరిస్థితి కావడంతో అక్కడ కరోనా వ్యాపించే అవకాశం లేదంటోంది అంతర్జాతీయ సమాజం. అయితే, ఒక వేళ వ్యాపించినా బయట ప్రపంచానికి తెలిసే అవకాశమూ లేదు. ఇంకో విషయం ఏంటంటే... ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ విషయంలో చిట్టచివరి ర్యాంకు తుర్కుమెనిస్తాన్‌ది.. అంతేకాదు... ప్రపంచంలోని 21 మంది నియంతల్లో 5వ స్థానం ఆ దేశాధ్యక్షుడిది.