అచ్చెన్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?

August 02, 2020

అవినీతి ఆరోపణల నేపథ్యంలో అనూహ్యంగా అదుపులోకి తీసుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదన్న సంగతి తెలిసిందే. పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను.. అదుపులోకి తీసుకోవటంతో పాటు.. వందలాది కిలోమీటర్లు పోలీసు వాహనంలో తిప్పటం వల్ల ఆయనకు గాయం తిరగబెట్టిందని డాక్టర్లు స్వయంగా ధృవీకరించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల రెండోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో ఉన్న ఆయన గురించి.. తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ.. అలాంటి చోట వైద్యం చేయించుకోవటం శ్రేయస్కరం కాదన్న వాదన వినిపిస్తోంది.

తాజాగా జీజీహెచ్ కు వెళ్లిన టీడీపీ నేతలు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. అచ్చెన్న విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. అచ్చెన్న ఆరోగ్యం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.

బీపీ పెరిగిందని.. షుగర్ లెవల్స్ తగ్గినట్లుగా చెబుతున్నారు. శనివారం వరకూ నడుమునొప్పితో బాధపడ్డారని చెబుతున్నారు. ఓవైపు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రుల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ.. అదే ఆసుపత్రిలో అచ్చెన్న వైద్యం చేయించుకోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీలైనంతవరకూ వేరే ఆసుపత్రికి తరలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్వయంగా ముఖ్యమంత్రి అచ్చెన్న కోరుకున్నచోట వైద్యం చేయించమని చెప్పినా ఎందుకు అలా జరగడం లేదు?