కరోనా బిల్లు.. జస్ట్ రూ.8.5 కోట్లు

August 13, 2020

ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్.. కరోనా చికిత్సకు బిల్లులు ఎలా ఉంటాయో చెబుతూ ఒక పెద్ద లిస్టు తమ ప్రాంగణంలో డిస్‌ప్లే చేసింది. అందులో కరోనా సాధారణ చికిత్సకు రోజుకు బెడ్ ఛార్జీలు రూ.25 వేల నుంచి 30 వేల వరకు పెట్టారు. వెంటిలేటర్‌తో అయితే రోజు వారీ బెడ్ ఛార్జీలు రూ.70 వేల పైనే అట.

ఈ లెక్కన ఒక రెండు వారాలు కరోనాతో ఆసుపత్రిలో ఉంటే పరిస్థితి ఏంటి అన్నది తలుచుకుంటేనే గుండె గుబేల్‌మంటోంది జనాలకు. ఓవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ హాస్పిటల్లో సరైన వసతులు లేవంటున్నారు. వైద్యులు సరిపడా లేక సరిగా పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు హాస్పిటల్స్ చూస్తే ఇలా బిల్లులు బాదేస్తున్నాయి.

దీన్ని బట్టి కరోనా ఎంత ప్రమాదకరం అన్నది అంచనా వేయొచ్చు. ఇక్కడ లక్షల్లో బిల్లు గురించే మనం భయపడే పరిస్థితి ఉంటే.. అమెరికాలో ఒక కరోనా పేషెంట్‌కు చికిత్స అందించి.. డిశ్చార్జ్ చేసే సమయానికి ఏకంగా రూ.8.5 కోట్ల బిల్లు వేయడం గమనార్హం.

అమెరికాలోని సియాటెల్‌ నగరానికి చెందిన మైఖేల్‌ ఫ్లోర్‌ అనే 70 ఏళ్ల వృద్ధుడు మార్చి 4న ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. వెంటనే చికిత్స ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం పూర్తిగా విషమించింది. వెంటలేటర్‌పై ఉంచారు. ఇక ఆయన బతకడం కష్టమే అనుకున్నారంతా. 

అక్కడి నర్సులు ఆయన కుటుంబ సభ్యులకు ఈమేరకు సమాచారమిచ్చారు. వారు వచ్చి స్వయంగా పరామర్శించే పరిస్థితులు లేకపోవడంతో ఫోన్‌లోనే భార్యాపిల్లలతో మాట్లాడించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా తర్వాతి రోజుల్లో చికిత్సకు స్పందించారు. వైద్యులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని చికిత్స అందించారు. వారి ప్రయత్నం ఫలించి ఫ్లోర్ కోలుకున్నాడు. 

62 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు కూడా. ఐతే చికిత్సకు అయిన బిల్లు చూసి వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏకంగా 11,22,501 డాలర్ల బిల్లు వేసింది హాస్పిటల్. అంటే మన రూపాయల్లో అయితే 8.5 కోట్లన్నమాట. ఎంతటి శ్రీమంతులైనా ఇంత బిల్లు అంటే వామ్మో అనుకోకుండా ఉండలేరు.

ఐతే ఫ్లోర్ కుటుంబం ఈ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేకపోయింది. వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత వైద్య బీమా ఫ్లోర్‌కు వర్తించడంతో ఆ బిల్లంతా అమెరికా ప్రభుత్వమే చెల్లించబోతోంది. ఐతే పన్నులు కట్టే వారి సొమ్ము నుంచి అంత మొత్తం తన బిల్లుకు చెల్లించనుండటం పట్ల ఫ్లోర్ విచారం వ్యక్తం చేశాడు.