కరోనా లెక్క ఎంతకు చేరింది?

August 13, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వైరస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటి వరకూ వందల్లో ఉన్న సంఖ్య ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోతోంది. క్యాలెండర్లో రోజులు గడుస్తున్నా.. వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ కనుక్కోవటంలో మాత్రం పాజిటివ్ ఫలితాలు నమోదు కావటం లేదు. దీంతో.. కొవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటివరకూ ఈ మాయదారి వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 2వేలకు చేరుకుంది.
ఒక్క బుధవారం నాడే 136 మంది మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కొత్తగా వైరస్ బారిన పడిన వారు 1749గా తేల్చారు. దీంతో.. వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 74,185కు పెరిగింది. వీరిలో 11,977 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరో 5,248 మంది అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైరస్ బారిన పడి.. దాన్ని జయించి ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. అలా కొవిడ్ ను అధిగమించిన వారు 14,376 మంది. వైరస్ బారిన పడినోళ్లకు వైద్య సేవలు అందిస్తున్న 1716 మందికి ఈ ప్రమాదకర వైరస్ అంటుకుంది. దీంతో.. వైద్య సాయం అందించే విషయంలో పలువురు భయాందోళనలకు గురి అవుతున్నారు.
చైనాలో కొవిడ్ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ఆ మాటకు వస్తే అంతకంతకూ విస్తరిస్తోందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. హాంకాంగ్ లో ఇప్పటివరకూ 62 కేసుల్ని గుర్తించారు. మకావులో పది మంది.. తైవాన్ లో 22 మంది వైరస్ బారిన పడ్డారు. చైనా బయట ఉన్న దేశాల్లో ఇప్పటివరకూ 900 మందికి వైరస్ బారిన పడినట్లుగా గుర్తించారు. కొవిడ్ కారణంగా చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారటమే కాదు.. ఇదే రీతిలో మరికొంతకాలం సాగితే.. మొదటికే మోసం వస్తుందన్న మాట వినిపిస్తోంది.
కొవిడ్ వైరస్ కారణంగా చైనాతో పాటు ప్రపంచదేశాలు ఏదోలా ప్రభావితమవుతున్నాయి. దీంతో.. అంతర్జాతీయ వృద్ధి రేటుతో పాటు.. కార్పొరేట్ లాభాల్ని సైతం ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. చమురు.. ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి.