వింతల్లో వింత... కరోనా అనుమానితుల డ్యాన్స్ ఇంటర్నెట్లో వైరల్ 

August 14, 2020

మనుషులు ఒక్కోసారి ఎంత వింతగా ప్రవర్తిస్తారో కనీసం అంచనా కూడా వేయలేం. కరోనా వైరస్ కు ప్రపంచం ఎంతగా గడగడలాడుతుందో తెలిసిందే. అన్ని ప్రపంచ దేశాలు చైనాతో తాత్కాలికంగా రవాణా సంబంధాలు తెంచుకున్నాయి. ఆ మాటకు వస్తే... చైనాలో కరోనా పుట్టిన వుహాన్ ప్రాంతంతో చైనా కూడా సంబంధాలను కట్టడిచేసుకుంది. వ్యాధి వ్యాప్తి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడికి ఎవరూ పోవడానికి, అక్కడి నుంచి ఎవరూ రావడానికి వారు ఒప్పుకోవడం లేదు. 

ఇదిలా ఉంటే... చైనా నుంచి భారతీయులు మొన్న ప్రత్యేక విమానంలో ఇండియా చేరుకున్నారు. అయితే... వారిని అందరినీ భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రదేశంలో పెట్టింది. వారిలో కరోనా లక్షణాలు ఉన్నాయో లేదా గుర్తించడానికి 15 రోజులు సమయం పడుతుంది. అంతవరకు వారిని నాలుగు సెక్టార్టుగా విభజించి వేర్వేరు డార్మిటరీల్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

అయితే... వారంతా అక్కడ ఉన్న సెక్యూరిటీ కళ్లు కప్పారో, మాయ చేశారో తెలియదు గాని... ఒకచోట చేరి డాన్సులు చేస్తున్నారు. వారిలో భయం, బాధ ఏమీ కనిపించడం లేదు. చాలా ఖుషీగా వారు డ్యాన్సులు చేస్తున్న వీడియో ఇపుడు ఫుల్ గా వైరల్ అవుతోంది.