ఇంత దారుణమా?

May 28, 2020

మండలి చైర్మన్‌పై దుర్భాషలా?
సభలో చుట్టూమూగి ఒత్తిడా?
మంత్రులా.. వీధి రౌడీలా?
వైసీపీ అసలు నైజం బట్టబయలు
రాజధాని, సీఆర్‌డీఏ బిల్లులను
సెలెక్ట్‌ కమిటీకి పంపకుండా నానా యాగీ
ఆయన చాంబర్లో విజయసాయికి ఏం పని?
గ్యాలరీలోకి సుబ్బారెడ్డి, సజ్జల ఎందుకొచ్చారు?
నీతిమంతులమంటూ
ముగ్గురు ఎమ్మెల్సీలను ఎలా కొన్నారు?
మాట విననందుకు ఏకంగా
మండలినే రద్దుచేస్తూ తీర్మానం
జనవరి 22.. శాసనమండలి చరిత్రలో బ్లాక్‌డే అని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్‌ తెంపరితనం.. అధికార పార్టీ నేతల తెంపరితనాన్ని ప్రపంచమంతా చూసింది. వైసీపీ ప్రజాప్రతినిధులు పక్కా వీధిరౌడీలన్న విషయం బయటకు పొక్కకుండా చూసుకోవడానికి.. మండలి చైర్మన్‌ అనుమతి లేకుండా మంత్రులే మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేయడం  కనీవినీ ఎరుగనిది. లిక్కర్‌ మాఫియా డాన్‌గా పేరొందిన మంత్రి బొత్స సత్యనారాయణ నైజం అందరికీ తెలుసు. ఆ రోజున ఆయన మండలిలో రౌడీకంటే హీనంగా ప్రవర్తించారు. ఇక కొడాలి నాని గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. చివరకు సౌమ్యుడిగా కనిపించే ఉపముఖ్యమంత్రి, మండలిలో సభానాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కూడా చైర్మన్‌ను దుర్భాషలాడడంతో ఎమ్మెల్సీలు ముక్కున వేలేసుకున్నారు.
ఏం జరిగింది..?
చంద్రబాబుపై కత్తిగట్టిన సీఎం జగన్‌.. అమరావతి ప్రాంతంలోనే ఉంటూ.. అక్కడి నుంచే పరిపాలిస్తూ.. అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ.. దానిపైనే ద్వేషం నింపుకొన్నారు. దానిని విశాఖకు తరలించాలని నిర్ణయించుకున్నారు. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని మూడు రాజధానుల ప్రకటనచేశారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో హైకోర్టు (న్యాయ రాజధాని) పెడతానని చెప్పారు. దానికి అనుగుణంగా రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రద్దు బిల్లు, పాలన వికేంద్రీకరణ-3 రాజధానుల బిల్లులను అసెంబ్లీ హడావుడిగా ఆరు గంటల్లో చర్చించి.. ఆమోదించేసింది. సభకు అడ్డుపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు గెంటేసింది. రాజధాని మార్పుపై ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఆ బిల్లులను మండలికి రిఫర్‌ చేసింది. జనవరి 22న మండలిలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిని చేపట్టరాదని రూల్‌ 72 కింద చర్చించాలని మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ పట్టుబట్టింది. దీనికి వైసీపీ అంగీకరించలేదు. అంతకుముందు రాత్రే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, పోతుల సునీత, శివనాథరెడ్డిలను వైసీపీ కొనేసింది. 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నానని డొక్కా ఏకంగా మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. మిగతా ఇద్దరూ రూల్‌ 72కి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ తర్వాత బిల్లులపై చర్చ జరిగింది. వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు. కానీ ఆలోపు ఆయనపై వైసీపీ ఎంతో ఒత్తిడి తెచ్చింది. తొలుత ఆయన్ను కొనాలని చూసింది. ససేమిరా అనడంతో బెదిరింపులకు గురిచేసింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు.. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండలి గ్యాలరీలో కూర్చుని సభ్యులను, చైర్మన్‌ను బెదిరిస్తూ కనిపించారు. పక్క గ్యాలరీలో చంద్రబాబు తిష్ఠ వేసి చైర్మన్‌ను ప్రభావితం చేశారని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు.. తమ నేతలు అక్కడకు ఎందుకు వచ్చారంటే నోరెత్తలేదు. చైర్మన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. సాయిరెడ్డి నేరుగా చైర్మన్‌ చాంబరుకే వెళ్లి.. సెలెక్ట్‌ కమిటీకి పంపొద్దని బెదిరించారు. మంత్రి బొత్స అయితే ఏకంగా వేలుచూపించి బెదిరించారు. కానీ చైర్మన్‌ విచక్షణాధికారంతో సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. మంత్రులు కొడాలి నాని, విశ్వరూప్‌ సహా 22 మంత్రులు మండలిలోకి వచ్చారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీలు 9 మంది. టీడీపీకి 34 మంది ఉన్నారు. పీడీఎఫ్‌, బీజేపీ ఎమ్మెల్సీలు కూడా ఈ బిల్లులను వ్యతిరేకించారు. ఓటింగ్‌ పెట్టినా బిల్లులు వీగిపోయేవి. అలా వీగిపోతే అసెంబ్లీ మళ్లీ ఆమోదిస్తే అవి చట్టాలయిపోతాయి. అందుకే టీడీపీ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబట్టి సాధించుకుంది.
నువ్వు సాయిబుకే పుట్టావా..?
ఆ తర్వాత బొత్స తదితరులు చైర్మన్‌ను దారుణంగా దూషించారు. షరీఫ్‌ వెంట ఆయన చాంబర్లోకి వచ్చిన బొత్స తీవ్ర దుర్భాషలాడారని ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తెలిపారు. నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతు చూస్తానంటూ మంత్రి ఘోరమైన దుర్భాషలాడారు. ఆయన ఎంత తిడుతున్నా చైర్మన ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో అర్జునుడు అడ్డుపడి మంత్రిని వెనక్కినెట్టారు. లేకపోతే చైర్మనపై బొత్స దాడి చేసేవారేమోనని అనిపించిందని ఓ మార్షల్‌ చెప్పడం గమనార్హం. ఇక సభలో అయితే లోకేశ్‌పై దాడికి కొడాలి నాని వచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావును కూడా కొట్టడానికి వచ్చారు. ఆయన తగురీతిలో స్పందించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు సెలెక్ట్‌ కమిటీకి అసలు పంపనేలేదని.. ఆ అధికారం చైర్మన్‌కు లేదని వైసీసీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. మండలిని రద్దుచేశామంటున్న నేతలు.. సెలెక్ట్‌ కమిటీకి ఎందుకు భయపడుతున్నారు? కార్యాలయాల తరలింపును హైకోర్టు నిలిపివేయడం.. సెలెక్ట్‌ కమిటీ నుంచి బిల్లులు రావడానికి 3 నెలలకుపైనే పట్టే అవకాశం ఉండడంతో జగన్‌ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎవరైనా పదవులకు రాజీనామా చేశాకే వైసీపీలోకి రావాలని, తాను నీతిమంతుడినని చెప్పుకొన్న ఆయన.. గన్నవరం, గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌లను వైసీపీలోకి అనధికారికంగా చేర్చుకున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు సునీత, శివనాథరెడ్డి పదవులకు రాజీనామా చేయకుండానే వైసీపీలో చేరారు. మరి ఇంతకుముందు జగన్‌ చెప్పిన నీతులేమయ్యాయి? 

RELATED ARTICLES

  • No related artciles found