విచిత్రం... GHMC చెత్త తీయకపోవడం వల్ల రెండు ప్రాణాలుపోయాయి

July 08, 2020

హత్య చేసిన వాడి కంటే హత్య చేయించిన వాడిదే పెద్ద తప్పు కదా. ఆ కోణంలో చూస్తే... ఈరోజు హైదరాబాదులో ప్రాణం పోగొట్టుకున్న కాబోయే దంపతుల విషయంలో అసలు దోషి జీహెచ్ఎంసీయే. హైదరాబాదు పరిపాలన విభాగం అయిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు అమాయకులు ప్రాణం పోగొట్టుకున్నారు అని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఏం జరిగిందో చూద్దాం.

హైదరాబాదులోని చందానగర్ ప్రాంతంలో ఎంఎంటీఎస్ పట్టాలపై రైలు ఢీకొని కాబోయే దంపతులు దుర్మరణం చెందారు. వీరు పాపిరెడ్డినగర్ కు చెందిన సోనీ, మనోహర్ అని విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే అది ఆత్మహత్య అని చాలామంది అనుకున్నారు. కానీ చివరకు అది ప్రమాదమే అని పట్టాలు దాటుతూ వారు ప్రమాదానికి గురయ్యారని తేలిందట. అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఉన్నా కూడా పట్టాలు ఎందుకు దాటారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తే... ఒక విచిత్రమైన విషయం బయటపడింది. 

ఫిబ్రవరిలో పెళ్లిపెట్టుకున్న వీరిద్దరికి ఇటీవలే ఎంగేజ్మెంట్ అయ్యింది. వారిద్దరు బట్టలు కొనడానికి వెళ్లారు. పట్టాల కింద ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద భారీగా చెత్తాచెదారం పడేసి ఉంది. అది మరీ ఎక్కువ దుర్గంధం వస్తుండటంతో అందులోంచి వెళ్లలేక పట్టాలు దాటుకుని వెళ్దాం అని పైకి చేరుకున్నారు. కొత్త జంట కావడంతో కబుర్లలో పడి అటు ఇటు పెద్దగా గమనించినట్టు లేదు. ఇద్దరు చేతులు పట్టుకుని పట్టాలు దాటుతున్నపుడే ఎంఎంటీఎస్ రైలు వేగంగా వచ్చి గుద్దేసివెళ్లింది. పెళ్లి కాబోయే జంట అలా దుర్మరణం పాలవడం స్థానికులను కలచివేసింది. మున్సిపాలిటీ వారు అండర్ పాస్ లో వేసిన చెత్తని తొలగించడంలో వహించిన నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను హరించింది. అయితే... ఈ ప్రాంతం జీహెచ్ఎంసీ పరిధిలోకి రాదని కొందరు అంటున్నారు. జీహెచ్ఎంసీ కాకపోతే చందానగర్ మున్సిపాలిటీ. రెండూ ఒకే రాష్ట్రం పెద్ద తేడా ఏమీలేదు. ఎవరో చేసిన తప్పుకు ఏవోప్రాణాలు పోవడం దయనీయం.