తానే కోర్టు.. తానే జడ్జి!

June 05, 2020

ఉన్నతాధికారులపై కత్తిగట్టిన జగన్‌
నిఘా మాజీ చీఫ్‌ వెంకటేశ్వరరావుపై వేటు
జగతి లావాదేవీలపై నివేదిక ఇచ్చినందుకు..
ఇప్పటికే కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌
ఆ సంస్థ షేరుకు అంత విలువ లేదన్న అధికారి
రూ.325 కోట్ల ఆదాయ పన్ను విధింపు
అదే నివేదిక ఆధారంగా సీబీఐ అభియోగాలు
అందువల్లే నేడు కక్ష సాధింపు
చంద్రబాబు హయాంలో కీలక పదవులు నిర్వహించిన ఉన్నతాధికారులపై సీఎం జగన్‌ కత్తిగట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించలేదన్న కక్షతో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను పక్కనపెట్టిన ఆయన.. తాజాగా వ్యక్తిగత కక్షతో నిఘా విభాగం మాజీ చీఫ్‌,  డీజీ ర్యాంకు అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆకస్మికంగా సస్పెండ్‌ చేశారు. నిఘా వ్యవస్థల పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగం మోపారు. అంతకుముందే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చి సులభతర వాణిజ్యం (ఈడీబీ) సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణకిశోర్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. ఆయనపై ఏసీబీ, సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ఇద్దరు అధికారులపై చంద్రబాబు సన్నిహితులన్న ముద్ర వేసి.. వారిపై లేనిపోని అభియోగాలు మోపినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే జగన్‌.. వెంకటేశ్వరరావుపై పగబట్టారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడం వెనుక ఆయనే ఉన్నారని.. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌, ప్రలోభాలతో ఆయన్ను టీడీపీలోకి తీసుకెళ్లారని మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో  ఆయనపై పదే పదే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి.. కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెచ్చి.. వెంకటేశ్వరరావును పదవి నుంచి తప్పించేలా చేశారు. తాను సీఎం అయ్యాక 9 నెలలుగా ఆయనకు పోస్టింగే ఇవ్వలేదు. ఇప్పుడు సస్పెండ్‌ చేసి దేశద్రోహం కేసు పెట్టేందుకు సమాయత్తమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. సస్పెన్షన్‌ కాలంలో ఆయన విజయవాడలోనే ఉండాలని.. ప్రభుత్వ అనుమతి లేనిదే ఊరొదిలి వెళ్లరాదని సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనపై వచ్చిన అభియోగాలు అవాస్తవమని.. సస్పెన్షన్‌ను చట్టపరంగా ఎదుర్కొంటానని వెంకటేశ్వరరావు ప్రకటించారు.
జైలుకు పంపారన్న ఆగ్రహంతో..
తాను జైలుకెళ్లడానికి మూలకారణం ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిశోరేనని జగన్‌ గట్టిగా భావిస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. కంపెనీలకు మేళ్లు చేసి.. అవిచ్చే లంచాలను తన కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో పెట్టించుకున్నారని జగన్‌పై సీబీఐ దశాబ్దం కిందట అభియోగాలు మోపింది. లంచాలను పెట్టుబడిగా పెట్టించిన కంపెనీయే జగన్‌ పత్రిక సాక్షి. జగతి పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఏర్పాటుచేసిన ఈ సంస్థ షేర్లకు భారీ ధర ఖరారుచేసి.. ప్రముఖ కంపెనీలతో వాటిని కొనిపించారు. ఈ అక్రమాన్ని కృష్ణకిశోర్‌ వెలుగులోకి తెచ్చారు. అధికారిగా తన పని తాను నిక్కచ్చిగా చేయడమే ఆయన నేరమైంది. జగన్‌ అక్రమాలను నిర్ధారించడమే శాపమైంది. పాత కక్షను మనసులో పెట్టుకుని ఆయన్ను అన్యాయంగా సస్పెండ్‌ చేశారు. చంద్రబాబు హయాంలో కృష్ణకిశోర్‌ కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఈడీబీ సీఈవోగా పని చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనను పక్కకు తప్పించారు. ఎలాంటి పోస్టింగూ ఇవ్వలేదు. అయితే... తనను రిలీవ్‌ చేస్తే కేంద్ర సర్వీసులకు వెళతానని కృష్ణ కిశోర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఆయనను సర్కారు రిలీవ్‌ చేయలేదు. అనూహ్యంగా ఆయనను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖల నుంచి అందుకున్న నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవోలో తెలిపారు. కృష్ణ కిశోర్‌పై ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌, సీఐడీ విడివిడిగా కేసులు నమోదు చేసి, అక్రమాలపై విచారణ జరిపి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ప్రకారం కృష్ణ కిశోర్‌ను సస్పెండ్‌ చేస్తున్నామని, క్రమ శిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు.. విచారణ పూర్తయ్యేవరకు హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లకూడదని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారిని సస్పెండ్‌ చేసే అధికారం రాష్ట్రానికి లేదు. కానీ కేంద్ర పెద్దల ఆశీస్సులతో జగన్‌ ఈ అక్రమానికి పూనుకున్నారని అంటున్నారు. ఈడీబీలో అక్రమాలకు తావులేదని తెలిసినా.. తానే కోర్టు.. తానే జడ్జి కాబట్టి కృష్ణకిశోర్‌కు శిక్షవేశారన్న మాట.
ఇదీ నేపథ్యం..
కృష్ణ కిశోర్‌ 2009లో ఆదాయపు పన్ను శాఖలో హైదరాబాద్‌ రేంజ్‌-2 అదనపు కమిషనర్‌గా ఉన్నారు. ఆయనకంటే పై హోదాలో కమిషనర్‌, చీఫ్‌ కమిషనర్‌ ఉంటారు. అప్పట్లో... జగతి పబ్లికేషన్స్‌ సంస్థ 10 రూపాయల ముఖ విలువ ఉన్న షేరును రూ.370 చొప్పున విక్రయించింది. అంటే.. ఒక్క షేరుకు రూ.360 ప్రీమియం! ఈ లావాదేవీ సక్రమంగానే జరిగిందో లేదో తేల్చాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) హైదరాబాద్‌ రేంజ్‌-2 ఐటీ అధికారులకు ఫైలు పంపింది. ఈ బాధ్యతను అదనపు కమిషనర్‌గా ఉన్న కృష్ణకిశోర్‌కు అప్పగించారు. ఆయన దీనిపై లోతుగా విచారణ జరిపారు. ‘జగతి పబ్లికేషన్స్‌కు ఉన్న ఆస్తులు సున్నా! ఆదాయమూ సున్నా! ఇలాంటి కంపెనీ షేరును రూపాయికి కూడా కొనరు. ఇంకా చెప్పాలంటే... జగతి కంపెనీ షేరు విలువ మైనస్‌ 18 ఉంటుంది’ అని తేల్చారు. ఈ షేరును రూ.370కి కొనడం అసాధారణమని తెలిపారు. ఈ షేర్లు కొన్న వారంతా వైఎస్‌ సర్కారు హయాంలో పలుమార్గాల్లో లబ్ధి పొందిన వారే అని కూడా గుర్తించారు. దీనిని ‘క్విడ్‌ ప్రొ కో’గా నిర్ధారించారు. షేర్ల విక్రయం ద్వారా జగతి సమకూర్చుకున్న సొమ్మును ‘ఇతర మార్గాల్లో ఆదాయం’ (ఇన్‌కమ్‌ ఫ్రం అదర్‌ సోర్సె్‌స)గా పరిగణించి రూ.325 కోట్ల పన్ను చెల్లించాలన్నారు. ఈ లావాదేవీపై సవివరమైన నివేదికను సీబీడీటీకి పంపించారు. దీనిపై జగతి పబ్లికేషన్స్‌ సీఐటీ అప్పీల్‌కు వెళ్లింది. నివేదిక పక్కాగా ఉందని, రూ.325 కోట్లు చెల్లించాల్సిందేనని సీఐటీ తెలిపింది. జగతి సంస్థ ఈ ఆదేశాలపై తిరిగి ఐఐసీటీకి అప్పీలుకు వెళ్లింది. అక్కడ ఇంకా విచారణ తేలనేలేదు. నాడు కృష్ణ కిశోర్‌ జగతి పబ్లికేషన్స్‌ లావాదేవీలపై రూపొందించిన నివేదికను సీబీఐ కూడా పరిగణనలోకి తీసుకుంది. దీనిని మరింత లోతుగా విశ్లేషించి, దర్యాప్తు జరిపి.. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు నమోదు చేసింది. ఆయన వల్లే సీబీఐ తనను జైలుకు పంపిందని జగన్‌ కక్షకట్టారు. ఇప్పుడు అవకాశం రావడంతో అక్రమంగా సస్పెండ్‌ చేసి.. ఆయనపై విచారణకు ఆదేశించి సంతృప్తి చెందుతున్నారు. ఇందుకు రిటైర్డ్‌ అధికారి పీవీ రమేశ్‌ను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఈయన సీఎంవోలో అదనపు సీఎస్‌ హోదాలో కొనసాగుతున్నారు. కృష్ణకిశోర్‌పై అభియోగాల వెనుక ఈయనే ఉన్నారు.
జీతంపైనా కొర్రీ..
ప్రభుత్వం తన కక్షసాధింపును అక్కడితో ఆపలేదు. ఆయనకు వేతనం చెల్లింపును ఆపేసింది. దీనిపై క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి విరుచుకుపడ్డారు. ‘కృష్ణకిశోర్‌పై ఏసీబీ/సీఐడీ దర్యాప్తునకు ఎలా ఆదేశిస్తారు? ఈడీబీ సీఈవోగా ఉన్న అధికారిని ఎక్స్‌అఫీషియో కార్యదర్శి/డిప్యూటీ సెక్రటరీగా ఎలా బదిలీ చేస్తారు? ఆయనపై చర్య తీసుకునేందుకే బదిలీ చేశారు. ఇలా బదిలీ చేసే అధికారం ఎవరిచ్చారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదని పాలకులు గుర్తించాలి. స్పెషల్‌ సెక్రటరీ స్థాయి అధికారిపై డిప్యూటీ కలెక్టర్‌ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం. ఇలా అయితే రేపు చీఫ్‌ సెక్రటరీ మీద ఎంఆర్‌వో ఫిర్యాదు చేస్తాడు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పనిచేయడానికి వచ్చిన అధికారిపై వ్యవహరించి తీరేనా ఇది? అయినా పీవీ రమేశ్‌ (సీఎం సలహాదారు) ఎవరు ? ఆయనకుండే అధికారాలేంటి? ఆయనెవరు మండలి సీఈవోపై చర్య తీసుకునేందుకు? ఇదేం పరిపాలన? కృష్ణకిశోర్‌ ఏం తప్పు చేశాడు? సస్పెండ్‌ చేసి ఏసీబీ/సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాల్సినంత పెద్ద తప్పా అది! ఆరోపణలకు సంబంధించి... ఆయన మాతృసంస్థ ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇచ్చారా? ఎంంత ధైర్యం ఈ తరహా చట్టవిరుద్ధ చర్యలు తీసుకోవడానికి’ అని మండిపడ్డారు. సస్పెన్షన్‌ జీవో అమలును నిలిపివేశారు. దీంతో ఆయనపై సీఐడీ/ఏసీబీ దర్యాప్తు కూడా నిలిచిపోయింది. మాతృసంస్థకు వెళ్తానని మే 19న కృష్ణకిశోర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. తనకు చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి వచ్చిందని.. విధుల్లో చేరకుంటే సీనియారిటీ పోతుందని.. వెంటనే తనను రిలీవ్‌ చేయాలని కోరారు. దీనికి స్పందన లేకపోవడంతో జూలై 3న మరో విజ్ఞాపన పత్రం పంపారు. అదే రోజున ఆయన్ను ఎక్స్‌అఫీషియో సెక్రటరీ/డిప్యూటీ సెక్రటరీగా జీఏడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అప్పటి నుంచి జీతం, పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారు.  రెండు వారాల్లో జీతభత్యాలను చెల్లించాలని ఆరువారాల కింద ఆదేశించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై మళ్లీ ఆయన క్యాట్‌ను వేడుకున్నారు. ఆగ్రహించిన ట్రైబ్యునల్‌.. దీనిపై సీఎస్‌ నీలం సాహ్నీ వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావలసి ఉంటుందని హెచ్చరించింది. దాంతో వ్యవహారం సీరియస్‌గా ఉందని జగన్‌ ప్రభుత్వానికి, సీఎస్‌కు కూడా అర్థమైంది. క్యాట్‌ హెచ్చరించిన రెండు గంటల్లోనే జీతం జమచేశారు. ట్రైబ్యునల్‌ తుది తీర్పు రావలసి ఉంది. వెంకటేశ్వరరావు కూడా ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తారని అంటున్నారు. 151 మంది సభ్యుల బలం ఉన్న తనను ఎవరూ  ఏమీ చేయలేరన్న దురంహకారంతో.. నియంతలా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అవి చట్టవిరుద్ధంగా ఉన్నా అమలు చేయాల్సిందేనని తమపై ఒత్తిడి తెస్తున్నారని అఖిల భారత అధికారులు వాపోతున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇలాగే వ్యవహరించి తమ సీనియర్లు కొందరు జైలుపాలయ్యారని వారు గుర్తుచేసుకుంటున్నారు. 

RELATED ARTICLES

  • No related artciles found