జగనన్నా... దేవుడి వల్ల కాదు నీవల్లే కేసులు తగ్గాయి

June 01, 2020

మొన్నటి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... దేవుడి దయవల్ల మన రాష్ట్రంలో 10 కేసులే ఉన్నాయని తెగ సంతోషపడ్డాడు. పాపం తన క్రెడిట్ ను కూడా దేవుడి అక్కౌంట్లో వేసేంతటి మంచోడు జగన్. ఎందుకంటే... ఏపీలో కేసులు తక్కువగా నమోదైంది దేవుడి దయ వల్ల కాదు. కేవలం ముఖ్యమంత్రి జగన్ వల్ల. మేమేదో జగన్ ను మోస్తున్నాం అనుకోవద్దు మీరు. వాస్తవం తెలిస్తే మీకు అర్థమైపోతుంది

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనుమానితులను టెస్టు చేస్తే ఇటలీ మినహా మిగతా అన్ని దేశాల్లోను 3-10 శాతం మందికి వ్యాధి ఉన్నట్లు నిర్దారణ అవుతోంది. మన ఏపీలోను అంతే... తెలంగాణతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని ఏపీ ప్రజలు అందరూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వారు తెలియక అలా ఆనందించడంలో తప్పులేదు. కానీ ముఖ్యమంత్రి ఆ కామెంట్లు చేయడమే అత్యంత విషాదకరమైన ప్రమాదకరమైన విషయం.

ఏపీలో తక్కువ కేసులు నమోదవడానికి కారణాలు ఏంటో ఎవరైనా స్పష్టంగా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకో తెలుసా.... కారణమే లేదు. కేవలం పెద్ద తప్పు మాత్రం ఉంది. ఆ తప్పేంటో తెలుసా.... అసలు టెస్టులు చేయకపోవడం. అవును ఇది పచ్చి నిజం. తెలంగాణలో ఎక్కువ మందికి టెస్టులు చేయడం వల్ల ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ఏపీలో తక్కువ మందికి టెస్ట్ చేయడం వల్ల తక్కువ కేసులు కనిపిస్తున్నాయి. సేమ్ మన దేశానికి కూడా ఇదే వర్తిస్తుంది.  

 

కేరళ, మహరాష్ట్రలు టెక్నాలజీ, ల్యాబరేటరీస్ ఎక్కువగా అందిపుచ్చుకోవడం వల్ల ఎక్కువ మందికి వేగంగా పరీక్షలు చేయగలిగారు. అందుకే ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ఆ మాటకు వస్తే... అమెరికాతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే...అమెరికా ఇప్పటికే పాతిక లక్షల మందికి పరీక్షలు చేయడంతో లక్ష కేసులు నమోదయ్యాయి. ఇండియా ఇప్పటివరకు కేవలం 30 వేల మందినే పరీక్షించింది కాబట్టి 900 కేసులే నమోదయ్యాయి. ఏపీ కూడా అంతే... 

మార్చి 25 రాత్రికి అందుబాటులో ఉన్న లెక్కలు తీసుకుంటే ఏపీలో కేవలం 250 మందికి టెస్టులు చేశారు. 10 మందికి వైరస్ సోకిన విషయం తెలిసింది. తెలంగాణలో 764 మందికి టెస్టులు చేశారు. అందులో 35 మందికి ఉందని తేలింది. ఈ విషయం జనాలకు చెప్పకుండా... మన వద్ద తక్కువ కేసులు ఉన్నాయని చెప్పడం వల్ల జనాల్ని మోసం చేయడమే కాదు, అది పెద్ద ముప్పు. ఎందుకంటే.... త్వరగా టెస్టులు చేస్తే త్వరగా వ్యాధి ఉన్న వారు ఎవరో తెలిస్తే వారికి చికిత్స చేసి తగ్గించొచ్చు. ఆలస్యంగా టెస్టులు చేస్తే... ఎక్కువ మందికి ఇది వ్యాపించి ఏపీని ముంచెత్తుతుంది.

దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే... జగన్ వల్ల ఏపీలో తక్కువ కేసులు మనకు కనిపిస్తున్నాయి. అంతేగాని దేవుడు ప్రపంచం అంతటినీ ఒకేవిధంగా ఆశీర్వదిస్తున్నారు.

ఏదేమైనా మన ముఖ్యమంత్రి ఎలాగో దేవుడి మీద భారం వేస్తారు. దేవుడి మీద భారం వేయడానికి ముఖ్యమంత్రి ఎందుకు .. అదేదో మనమే ఆ కలియుగ దైవాన్ని మా రాష్టాన్ని కాపాడుతండ్రీ అని దండం పెట్టుకుంటే మనకు ఎక్కువ శ్రేయస్కరమమేమో!