ప్రపంచానికి మహమ్మారి.. జగన్‌కు మాత్రం చిన్నపాటి జ్వరం

August 12, 2020

కాసేపు మందులు వేస్తే పోతుందంటారు!
మరికాసేపు కరోనాతో సహజీవనం తప్పదంటారు!
అందరికీ రాదని ఒకసారి..
ఎవరికైనా రావొచ్చని మరోసారి
స్పష్టత లేకా.. గందరగోళానికి
అర్థం కాని ముఖ్యమంత్రి తీరు
విశ్వమంతా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఒకరోజు తగ్గినట్లు అనిపించినా మర్నాడు రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. మరణాల విషయంలో అమెరికా, ఐరోపా పోటీపడుతున్నాయి. మొదట్లో పెద్ద ప్రభావం కనిపించకున్నా.. రష్యా ఇప్పుడు కిందమీదులవుతోంది. చైనా నుంచి మళ్లీ ఎప్పుడు సోకుతుందోనని ఆసియా దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఇటీవలి వరకు మనదేశంలో చాలా వరకు నియంత్రణలోనే ఉంది. తాజాగా అంతకంతకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. నవ్యాంధ్రలో పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రం ఇది మామూలు చిన్నపాటి జ్వరం. మందులు వేసుకుంటే కరోనా పోతుందంటారు. ఈ వైరస్‌కు మందే లేదు. ఇంతవరకు కనిపెట్టనేలేదు. వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగ దశల్లోనే ఉంది. ఆరేడు నెలల్లో గానీ పూర్తి ఫలితం రాదు. ప్రస్తుతానికి యాంటీ మలేరియా డ్రగ్‌ అయిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వేసుకోవడం మంచిదని.. అది కూడా పరిస్థితులను బట్టి వేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గారు మాత్రం మందు వేసుకుంటే పోతుందంటారు. ఏ మందు వేసుకోవాలో చెప్పరు. అసలా వ్యాధి లక్షణాలపైనా ఆయనకు అంత అవగాహన ఉన్నట్లు లేదు. మందులు వేసుకుంటే పోయే రోగంతో జీవితాంతం సహజీవనం తప్పదని వేదాంత రహస్యాలు కూడా బోధిస్తున్నారు. అందరికీ వైరస్‌ సోకదని.. బీపీ, షుగర్‌, ఆస్తమా ఉన్నవారు, పెద్ద వయసులో ఉన్న వారు చనిపోయారని.. వారిపైనే కాస్తోకూస్తో ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వారి విషయంలోనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇతరులపై ప్రభావం లేదని క్లియర్‌కట్‌గా తెలుస్తోందని చెప్పారు. వయసుతో నిమిత్తం లేకుండా రెండు నెలల శిశువు నుంచి 60 ఏళ్లు దాటిన వారి వరకు అందరికీ ఇది సోకుతోందని మన రాష్ట్రంలో నమోదైన కేసులను గమనించినా అర్థమవుతుంది. అయినా సీఎం ఇలా చెబుతున్నారంటే.. ఆయనకు తెలియదనుకోవాలి.. లేదంటే అబద్ధాలతో జనాన్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశమైనా ఉండి ఉండాలి.
భయంకర రోగం కాదట!
‘కరోనా గురించి కొన్ని విషయాలు ప్రజలకు కచ్చితంగా చెప్పాల్సిన అవసరముంది. ఎందుకంటే... మనం ఎన్ని చర్యలు తీసుకున్నా, దీనిని పూర్తిగా ఎప్పుడూ కట్టడి చేయలేం. ఒక మనిషి ఎక్కడో ఒకచోట కరోనాతో మిగిలినా... ఆ మనిషి దగ్గడమో, తుమ్మడమో చేస్తాడు. అది ఎక్కడో ఒకచోట అంటుకుంటుంది. ఇది నెవర్‌ ఎండింగ్‌ ప్రాసెస్‌. కరోనా ఎప్పటికీ పోయే పరిస్థితి ఉండదు. ఎందుకీ విషయాలు చెపాల్సి వస్తోందంటే...  రాబోయే రోజుల్లో మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని గమనించాలి. కరోనా ఒక భయంకరమైన రోగమని, అంటరాని వ్యాధి అనే భావన దయచేసి అందరూ బుర్రలోంచి తీసేయాలని సవియనంగా కోరుతున్నాను. అయితే కరోనాను ఎప్పటికీ తీసేయలేం. మన జీవనంలో ఇది కూడా ఒక అంతర్భాగం అవుతుంది. స్వైన్‌ఫ్లూ కూడా అంతే. ఇట్‌ జస్ట్‌ పాసెస్‌ ఆన్‌! అంటువ్యాధి. ఒకసారి వచ్చిన వ్యక్తి దానిని మరొకరికి అంటించే అవకాశముంది. చికెన్‌పాక్స్‌... అమ్మోరు అని మనం అంటామే! అదీ అంతే. ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయి. ఇవన్నీ నయమయ్యేవే. కరోనా కూడా అంతే. అయితే... వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుని, కాస్త మందులు వేసుకుని, కాస్త జాగ్రత్తగా ఉంటే నయమైపోతుంది. ఇది ఎవరికైనా రావొచ్చు. కరోనా లక్షణాలు ఉంటే 104, 14410కు ఫోన్‌ చేస్తే చాలు! డాక్టర్లు ఇంటికే వస్తారు, మందులు ఇచ్చి పోతారు. చాలావరకు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. మీ అంతట మీరు చెబితే వెంటనే డాక్టర్లు వస్తారు! నయం చేసి వెళ్లిపోతారు. దీనివల్ల మిగిలిన వాళ్లకు సోకకుండా పోతుంది. ఇది పోవాలంటే మనంతట మనమే కట్టడి చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకుని... మంచి ఆహారం, మంచి లైఫ్‌ స్టైల్‌ అలవాట్లు చేసుకోవాలి. పండ్లు,  కూరగాయలు తినాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి’ అని జగన్‌ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కరోనా సోకినవారి ఇళ్లకు డాక్టర్లను పంపుతున్నారా..? రానివాళ్లు రోగం నయం చేయడమేంటి? అదేమని అడిగితే.. ఆస్పత్రుల నుంచి, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి ఎంతోమంది డిశ్చార్జ్‌ అవుతున్నారని.. నయమయితేనేకదా డిశ్చార్జ్‌ అయ్యేదని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ మందికి టెస్టులు చేయడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ సీఎం మాత్రం ఇప్పటికి లక్షా 25 వేల మందికిపైగా టెస్టులు చేశామని.. ప్రతి పది లక్షల జనాభాకు 2,345 మందికి పరీక్షలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని రోజూ ఊదరగొడుతున్నారు. నిజంగా ప్రథమ స్థానంలో ఉంటే కేంద్రం ఒక్కసారైనా ప్రకటించేది కదా! ర్యాపిడ్‌ టెస్టు కిట్లతో వైరస్‌ నిర్ధారణ కాదని భారతీచ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తేల్చిచెప్పింది. పీసీఆర్‌ కిట్లతోనే కరోనాను నిర్ధారించగలమని స్పష్టం చేసింది. కానీ అక్కరకు రాని కిట్లను లక్షకుపైగా కొనుగోలుచేసి.. వాటితో పరీక్షలు జరుపుతూ.. టెస్టుల్లో రికార్డు సృష్టించామని చెబితే ప్రజలు అమాయకులు కాదన్న విషయాన్ని జగన్‌ గుర్తెరగాలి. అంతేకాదు.. గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో వైసీపీ నేతలే కరోనా పరీక్షలను అడ్డుకున్నారు. వారిని సీఎం ఎక్కడా కట్టడి చేయలేదు. ఇప్పుడు చేతులు కాలాక దానిని కప్పిపెట్టేందుకు రోజూ సమీక్షలు చేస్తున్నట్లు కలరిస్తున్నారు. నిజానికి లాక్‌డౌన్‌ అమలు ఆయనకు ఇష్టం లేదు. వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను ప్రస్తుతిస్తూ ప్రజలంతా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపిస్తే.. జగన్‌ ఎలా వ్యవహరించారో ప్రజలంతా చూశారు. ఇష్టం లేనట్లు కొవ్వొత్తి పట్టుకుని.. 9 నిమిషాలకు ముందే లోపలకు వెళ్లిపోయారు. ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే..రెడ్‌జోన్లలో తప్ప మిగతా చోట్ల లాక్‌డౌన్‌ ఎత్తేయాలని జగన్‌ కోరి.. నలుగురిలో నవ్వులపాలయ్యారు. తబ్లీగీ జమాత సమావేశానికి వెళ్లివచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని సాక్షాత్తూ కేంద్రమే తప్పుబట్టింది. ఆ తర్వాత గానీ వారి అన్వేషణకు యంత్రాంగం పూనుకోలేదు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్న విషయం కూడా ప్రపంచమంతటికీ తెలుసు. కానీ ప్రజలకు ఏమీ తెలియదన్న భావనలో జగన్‌ ఉన్నారు.