మోడీ కేబినెట్ లో "క్రిమిన‌ల్స్" లిస్ట్ ఇదే

July 13, 2020

గ‌డిచిన కొద్ది రోజులుగా ప్రాంతీయ‌.. జాతీయ‌.. ఇలా ఎక్క‌డ చూసినా మోడీ గొప్ప‌త‌నం గురించి.. ఆయ‌న మొన‌గాడిత‌నం గురించి అదే ప‌నిగా వ‌స్తున్న క‌థ‌నాలు అన్ని ఇన్ని కావు. విప‌క్షాల విమ‌ర్శ‌నాస్త్రాల‌తో పాటు.. భారీగా ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు క‌నిపించిన వేళ‌లో మోడీ నేతృత్వానికి ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగిపోయే ప‌రిస్థితి. ప్ర‌జాతీర్పు అంత సానుకూలంగా ఉన్న వేళ‌.. మోడీని వేలెత్తి చూపించే ద‌మ్ము.. ధైర్యం ఎవ‌రు చేయ‌గ‌ల‌రు?
ఇక్క‌డ అంద‌రూ మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. మోడీకి మించినోళ్లు.. స‌మ‌ర్థులు.. తిమ్మిని బ‌మ్మిని చేసే సామ‌ర్థ్యం ఉన్నోళ్లు లేర‌న్న‌దే ప్ర‌జ‌ల మాట‌. ఈ కారణంతోనే వారు మ‌రో దారి లేక మోడీని నెత్తిన పెట్టుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌ధాని కుర్చీలో మోడీని కూర్చోబెట్టేసిన దేశ ప్ర‌జ‌లు స్థానికంగా మాత్రం అందుకు భిన్న‌మైన తీర్పులు ఇస్తున్న తీరు చూస్తే.. వారి భావ‌న ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.
మోడీ చాలా మంచోడ‌ని.. త‌న కేబినెట్ లో ఆయ‌న ఎంపిక చేసే మంత్రులంతా ఆణిముత్యాల్లాంటి వార‌న్న‌ట్లుగా కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిజ‌మే.. అలాంటి ఆణిముత్యాలు చాలా స్వ‌ల్ప‌మే. మిగిలిన వారంతా మామూలు ముదుర్లు కాద‌న్న విష‌యం వారి నామినేష‌న్ ప‌త్రాల్ని ప‌రిశీలిస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. మోడీ కేబినెట్ లో మొత్తం 57 మంది స‌భ్యులు ఉండ‌గా.. వారిలో 22 మంది మంత్రుల మీద క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. అంతేనా.. ఆ 22 మందిలో 16 మంది బ్యాక్ గ్రౌండ్ మ‌రింత సీరియ‌స్ మ‌రి. ఆ ప‌ద‌హారు మంది మీద హ‌త్య‌లు.. ఉగ్ర‌వాదం.. ద‌హ‌నాలు.. అత్యాచారాలు.. దొంగ‌త‌నాలు.. మ‌త‌క‌ల‌హాలు.. కిడ్నాప్ లాంటి ఆరోప‌ణ‌లు బోలెడ‌న్ని ఉన్నాయి. ఈ విష‌యాలు మేం చెప్ప‌టం లేదు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న నామినేష‌న్ ప‌త్రాల్లో నేత‌లే స్వ‌యంగా పేర్కొంటూ అఫిడ‌విట్లు దాఖ‌లు చేశారు.
కేంద్ర‌మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప్ర‌తాప్ చంద్ర సారంగి.. బుబుల్ సుప్రియో.. గిరిరాజ్ సింగ్.. నిత్యానంద రాయ్.. అమిత్ షా.. ప్ర‌హ్లాద్ జోషిల‌పై మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌లు రెచ్చ‌గొట్టిన‌ట్లుగా పోలీసులు కేసులు పెట్టారు. అశ్వ‌నీ కుమార్ చౌబే.. నితిన్ గ‌డ్క‌రీ.. గిరిరాజ్ సింగ్ ల‌పై ఎన్నిక‌ల వేళ‌లో ఓట‌ర్ల‌కు డ‌బ్బులు ఇచ్చి ప్ర‌భావితం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
ఇక‌.. విదేశీ.. పార్ల‌మెంటరీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌మంత్రి క‌మ్ బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ముర‌ళీధ‌ర్ పైన అయితే హ‌త్యాయ‌త్నం కేసు ద‌ర్యాప్తులో ఉంది. ఇలా కేంద్ర‌మంత్రుల్లో 39 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉంటే.. మ‌న కేంద్ర‌మంత్రుల్లో 91 శాతం మంది కోటీశ్వ‌రులే కావటం గ‌మనార్హం. ఒక్క హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ బాదల్ త‌న ఆస్తిని ఏకంగా రూ.217 కోట్లుగా పేర్కొన‌టం మ‌ర్చిపోలేం. ఇప్పుడు చెప్పండి ఆణిముత్యం లాంటి మోడీ మాష్టారి కేబినెట్ లో మంత్రుల ఎంపిక భ‌లేగా ఉంద‌ని చంక‌లు గుద్దుకుంటారా?