తెలంగాణకు కేంద్రం రాసిన లేఖతో ఏపీలోనూ టెన్షన్

February 17, 2020

నేర చరిత్ర ఉన్న, కేసులు నమోదైన ప్రజాప్రతినిధుల్లో వణుకు మొదలైంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వేగంగా విచారణ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ అంశం ప్రజాప్రతినిధుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణ కేసులు ఉన్న వారిలో పెద్దగా ప్రతిస్పందన కనిపించకపోయినా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మాత్రం గుబులు కనిపిస్తోంది. మరి కొందరు గతంలో రాజకీయ దురుద్ధేశ్యాలతో తమపై కేసులు నమోదు చేశారని విచారణ పూర్తయితే నిర్దోషులుగా బయటపడతామని ధీమాగా ఉన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ పూర్తి చేయాలని ఓ వ్యక్తి రాసిన లేఖకు స్పందించిన కేంద్రం అక్కడి అత్యున్నత న్యాయస్థానాన్ని కేసుల విచారణ పూర్తి చేయాలని కోరడం రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 మంది ఎమ్మెల్యేల్లో కేసులు నమోదైన ఎమ్మెల్యేల సంఖ్య 72గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 67 మంది వైకాపా, ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019 ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్లను ఆధారంగా చూస్తే... వైకాపాకి చెందిన 67, టీడీపీకి చెందిన ఐదుగురు కేసుల్లో ఉన్నారు. మొత్తం 72 మందిలో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు 57 మంది ఉండగా ఇతరులు సాధారణ కేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో 27 మందిపై హత్య, హత్యాయత్నం, మహిళలపై దాడులు వంటి ఆరోపణలు ఉన్నాయి.  సాధారణ కేసుల్లో ఎక్కువగా రాజకీయ ఉద్ధేశ్యాలతో నమోదైనవి ఉన్నాయి.
తాజాగా కేంద్రం తెలంగాణ హైకోర్టుకు రాసిన లేఖతో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలో వేగం పుంజుకుని ఆరు నెలల్లో తీర్పు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులపై స్థానిక కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఏ కోర్టులోనైనా ఆరు నెలల్లో తీర్పు వస్తే ఆ తరువాత ఆ పై కోర్టుల్లో విచారణ కోసం వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఏ కోర్టులోనైనా నేరం రుజువై తీర్పు వస్తే పదవిని కోల్పోయే అవకాశం ఉంది. పై కోర్టులో దావా వేసి బెయిలు వచ్చే వరకు జైలులో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నేరం రుజువు కాకపోతే ఇంత కాలం ఎదుర్కొన్న ఆరోపణలకు తెరపడి ప్రశాంత జీవనం లభిస్తుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొంది. తీర్పులు ఎలా ఉంటాయో, తమ భవితవ్యం ఏంటన్నది వారని ఆందోళనకు గురిచేస్తోంది.  కేంద్రం తెలంగాణ హైకోర్టుకు లేఖ రాసినా దేశంలోని ఇతర రాష్ట్రాలన్నింటికీ అది వర్తిస్తుందని న్యాయవాదులు అంటున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు ఆదేశించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తాజా లేఖతో మరింత ఒత్తిడి పెరుగుతుందని వారంటున్నారు.