​చంద్రబాబుకు టఫ్ టైం !

July 07, 2020

రాజకీయం హద్దులు దాటితే... అధికారం అత్యవసరం అవుతుంది. ఇపుడు తెలుగు రాష్టాల పరిస్థితి ఇలాగే ఉంది.​ పూర్వం ప్రతిపక్ష పార్టీలలో ఎంతో ధైర్యం కనిపించేది. దూకుడుగా అధికార పార్టీ మీద దాడిచేసేవారు. పవర్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే ఆవేదన తప్ప మిగతా బాధలు ప్రతిపక్షానికి ఉండేవి కావు. కానీ రోజులు మారిపోయాయి. బతికిబట్టకట్టాలంటే అధికారంలో ఉండి తీరాలి అని ప్రతి పార్టీ భావిస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉంటే మనపని అయిపోయినట్టే అని భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రల్లో అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి.
రాజకీయం హద్దులు దాటి వ్యక్తిగత కక్షల దాకా వెళ్లడం వల్లే ఈ సమస్య. ఏపీలో తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇదే. ఇక చంద్రబాబు నాయుడు పరిస్థితి అయితే మరింత ఇబ్బంది కరం. పార్టీ అధినేత ఆయన. ఇంతకాలం అధికారంలో ఉన్నపుడు తెలుగుదేశం నేతలు వ్యవహరించిన తీరు వల్ల ఇపుడు జగన్ తో, బీజేపీతో ఇబ్బందులు తప్పవేమో అని ఒక్కొక్కరు నాయకులు పార్టీ మారడానికి చూస్తున్నారు. వ్యాపార ప్రయోజనాలు కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, వారసుల పరిరక్షణ కోసం కావచ్చు... నెలరోజుల్లోపు ఐదారు మంది తెలుగుదేశం నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరాలని తపిస్తున్నారు. వీరిలో మొదటి వరుసలో ఉన్నది జేసీ దివాకర్ రెడ్డి. వ్యాపార పరంగా, రాజకీయ పరంగా క్షేమంగా ఉండాలంటే కేంద్రం అండ కావాలన్నది జేసీ ఆలోచన. పైగా బీజేపీ కూడా ఉద్దేశపూర్వకంగా తన పార్టీని బలపరుచుకోవడానికి అధికార వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ఇక కొద్ది రోజులుగా కేశినేని నాని కూడా అయోమయంగా ప్రవర్తిస్తూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఇలా పలువురు తెలుగుదేశం నేతలను రాష్ట్రంలో మిత్రుడు అయిన జగన్ ను వాడుకుని, కేంద్రంలో తన పవర్ వాడుకుని భయపెట్టి తన పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ పరోక్షంగా ప్రయత్నం చేస్తుంది. ఇతర పార్టీల వారిని ఆకర్షించడం రాజకీయంగా తప్పేం కాదు గాని... అందుకోసం అవలంబిస్తున్న విధానమే తప్పు.
వస్తారా, చస్తారా... అన్నట్టు బెదిరించి తెచ్చుకునే చేరికల వల్ల పార్టీ ఎంతకాలం నిలదొక్కుకోగలదు. ఒక నేత మనస్ఫూర్తిగా నమ్మితేనే ఆ పార్టీకి ఉపయోగపడతాడు. లేకపోతే మళ్లీ మళ్లీ అధికారం ఎవరి చేతిలో ఉంటే వారి పంచన చేరతాడు. బీజేపీలోచేరితే ఈ ఐదేళ్లు సేఫ్. మరి తర్వాత? ఇక ఎప్పటికీ కేంద్రంలో బీజేపీయే వస్తుందని గ్యారంటీ లేదు కదా. భవిష్యత్తు సంగతి పక్కన పెడితే... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తమ నాయకుల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవడానికి చంద్రబాబు ఆపసోపాలు పడే పరిస్థితి. రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు ఇది చాలా టఫ్ టైం. ఇపుడు కనుక వీటిని అధిగమించి నిలదొక్కుకుంటే పార్టీ మరింత బలిష్టంగా తయారవుతుంది. లేదంటే... మరింత బలహీనపడుతుంది. బీజేపీ ఆకర్ష్ ను, వైసీపీ అణచివేత చర్యలను చంద్రబాబు ఎలా ఎదుర్కోబోతున్నారన్నదే తెలుగుదేశం భవిష్యత్తును నిర్ణయించబోతోంది.