Amphan: తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారో తెలుసా?

August 15, 2020

మన దేశంలోని తీర ప్రాంతాలకు తుపానులు కొత్తేమీ కాదు. తుపాను క్రియేట్ చేసే బీభత్సం పాతదే అయినా...ప్రతిసారి తుపానకు పెట్టే పేరు మాత్రం కొత్తగా....ఇంకా చెప్పాలంటే వెరైటీగా ఉంటుంది. తిత్లీ...హుద్ హుద్....పెథాయ్...ఇపుడు తాజాగా అంఫాన్(ఉమ్ పున్) ఇలా నోరు తిరగడానికి వీలు లేకుండా హాలీవుడ్ సినిమా టైటిళ్లలా ఉంటాయి తుపాన్ల పేర్లు. అయితే, ఈ పేర్లేదో సరదాగా సినిమా టైటిళ్లలా పెట్టినవి కాదు. వాటి వెనుక ఓ అర్థం ..పరమార్థం ఉంటుంది. అసలు తుపాన్లకు పేర్లు ఏ విధంగా పెడతారు....వాటి వెనుక ఉన్న మతలబు ఏమిటి అన్న విషయాలపై నమస్తే ఆంధ్ర పాఠకుల కోసం ప్రత్యేక కథనం.

Amphan తుపాను మనదేశంలోని ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను వణకిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరకోస్తా ప్రాంతంలో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. బుధవారం నాటికి ఇది పశ్చిమబెంగాల్‌లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అంఫాన్ తుపాను పేరు గురించి చర్చ మొదలైంది. అంఫాన్ లేదా అంఫన్...ప్రస్తుతం ఈ రెండు పదాలు ఈ తుపానుకు వాడుకలో ఉన్నాయి. అయితే, అసలు Amphan ను ఉమ్ ‌పున్(Um-pun) అని పలకాలట. థాయిలాండ్ దేశానికి చెందిన ఈ పదానికి ఆకాశం అని అర్థం. Amphan పేరును థాయిలాండ్ 2004లోనే పెట్టింది.

వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్ తుపాన్లకు పేర్లను నిర్ణయిస్తారు.భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమి తుపాను పేర్లను నిర్ణయిస్తుంది. కొన్ని పేర్లతో కలిపిన ఓ జాబితాను ఈ కూటమి తయారుచేస్తుంది. 2004లో ఇలా ఈ 8 దేశాలు ఒక్కో దేశానికి 8 చొప్పున పేర్లు నిర్ణయించి మొత్తం 64 పేర్లతో ఓ జాబితా రూపొందించాయి. ప్రతి ఏటా విలయ తాండవం చేసే తుపాన్లకు ఆ 64 పేర్లను వరుసగా పెడుతుంటాయి. అంఫాన్ తుపాను కంటే ముందు వచ్చిన తుపాను పేరు ఫొని(Fani). వరుస క్రమం ప్రకారం బంగ్లాదేశ్ ఫొని పేరు పెట్టింది.

ఇలా 2004లో రూపొందించిన జాబితాలోని 64 పేర్లలో Amphan చివరి పేరు. లెక్క ప్రకారం ఆ 64 పేర్ల జాబితాలోని తొలిపేరు రాబోయే కాలంలో వచ్చే తర్వాతి తుపాను పేరు కావాలి. అయితే, 2018లో వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్ ఆ 8 దేశాల కూటమిలో మరో 5 దేశాలను చేర్చింది. ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ లతో కలిపి ఆ దేశాల జాబితా 13కు చేరింది. దీంతో13 చొప్పున 13 దేశాలు కలిపి 169 పేర్లతో కొత్త జాబితా రూపొందించారు.కొత్త జాబితా ప్రకారం బంగ్లాదేశ్ పెట్టిన మొదటి పేరు నిసర్గ (Nisarga). ఆ తర్వాత భారత్ గతి(Gati) అనే పేరును, నివార్ (Nivar) అనే పేరును ఇరాన్ పెట్టాయి.నెక్స్ట్ బురేవి (Burevi) అనేది మాల్దీవులు ప్రతిపాదించిన పేరు, తౌక్టే(Tauktae) అని మయన్మార్ ప్రతిపాదించింది. కొత్త జాబితాలో ఇండియా పెట్టిన పేర్లు కూడా 13 ఉన్నాయి.

 

Tej(తేజ్)
Murasu(మురసు)
Aag(ఆగ్)
Vyom(వ్యోమ్)
Jhar(ఝర్)
Probaho(ప్రొబాహో లేదా ప్రవాహ)
Neer(నీర్)
Prabhanjan(ప్రభంజన్)
Ghurni(ఘుర్ని)
Ambud(అంబుధ్)
Jaladhi(జలధి)
Vega(వేగ)

ఒక్కో సముద్రంలో జన్మించే తుపాన్ల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఇలా వేరే వేరు పేర్లు పెడుతున్నారు. ప్రతి మహాసముద్ర పరిధిలో ఏర్పడే తుపాన్లకు అక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్లు పేర్లు పెడుతుంటాయి.

తుపాన్లకు పెట్టే పేర్లకు రాజకీయాలతో సంబంధం ఉండకూదు. ఏ ఒక్క జెండర్‌నో , ఏ ఒక్క కల్చర్‌నో, ఏ ఒక్క మతాన్నో సూచించేలా ఆ పేర్లు ఉండకూడదు. వీటన్నిటికీ అతీతమైన పదం అయ్యుండాలి. ఎవరి సెంటిమెంట్లను బాధపెట్టేలా పేర్లు ఉండకూడదు.
తీవ్రమైన, క్రూరమైన పదజాలం కాకూడదు. చిన్న పదాలు, సులభంగా పలికేవి అయ్యుండాలి.ఇంగ్లిష్‌లో 8 అక్షరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.