చిరు కోడ‌లు సూప‌ర‌బ్బా!

May 24, 2020

మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఫ‌క్తు సినిమా ఫ్యామిలీనే. చిరు కుటుంబానికి చెందిన వారంతా దాదాపుగా సినిమాల్లోనే ఉన్నారు. చిరు వార‌సుడిగా వ‌చ్చిన రాంచ‌ర‌ణ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగాడు. అయితే చెర్రీ భార్య‌గా చిరు ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిన ఉపాస‌న మాత్రం సినిమా మ‌నిషిగా ముద్ర వేయించుకోలేదు. పెళ్లికి ముందు నాటి నుంచే సోష‌ల్ స‌ర్వీస్ లో త‌న‌దైన ముద్ర వేసుకున్న ఉపాస‌న‌... పెళ్లి త‌ర్వాత కూడా అందులోనే మునిగి తేలుతున్నారు.

భ‌ర్త సినిమాల‌తో బిజీబిజీగా ఉంటుంటే.. ఉపాస‌న మాత్రం త‌న‌కిష్ట‌మైన సామాజిక సేవ‌లో మ‌రింత ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. త‌న భ‌ర్త ఫ్యామిలీ సినిమా రంగంలో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంటే... అదే కుటుంబానికి ఇప్పుడు ఉపాస‌న కూడా సామాజిక సేవా రంగంలో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించి పెట్టారు. సినిమాల్లో ఫాల్కే అవార్డుకు అర్హులైన వ్య‌క్తిగా చిరు ఉంటే... తాను కూడా త‌క్కువేమీ కాద‌ని, తానూ ఫాల్కే అవార్డును సాధించి చూపింది. సామాజిక సేవా రంగంలో ఉపాస‌న చేస్తున్నసేవకు గుర్తింపుగా ఇప్పుడు ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పుర‌స్కారం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా ఉపాస‌న‌ను ఈ అవార్డు క‌మిటీ... *ఈ ఏటి మేటి పరోపకారి*గా కీర్తించింది.

అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. భిన్నరంగాలకు చెందిన ప్రతిభావంతులకు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తున్నారు. ఈ అవార్డు ప్ర‌క‌ట‌న‌పై హ‌ర్షం వ్యక్తం చేసిన ఉపాస‌న‌... ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నానని ప్ర‌క‌టించింది. ఇక త‌న‌ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది.