ఏపీ ఎన్నిక‌ల‌పై డాల‌స్ ఎన్నారై టీడీపీ స్పెష‌ల్ మీటింగ్

August 07, 2020

ఏపీలో ఏప్రిల్‌ 11 న జరగనున్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు డాల‌స్ లో ప్ర‌త్యేకంగా సమావేశం అయ్యారు. ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్న ఈ స‌మావేశంలో కొమ్మినేని శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఏపీ ప్ర‌జలు గుర్తించాల‌ని, దక్షిణ భారత దేశంలోనే అత్యంత వేగంగా రెండంకెల వృద్ధి రేటును న‌మోదు చేసిన స‌ర్కారు చంద్ర‌బాబుదే అని వెల్ల‌డించారు. అహ‌రం రాష్ట్ర అభివృద్ధి మీదే దృష్టిపెడుత‌న్న చంద్ర‌బాబు మ‌ళ్లీ గెలిస్తేనే రాష్ట్ర పురోగ‌తి సాధ్య‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.
వెంక‌ట్ జిల్లెళ్ల‌మూడి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌జ‌లు ఓటు ప్రాముఖ్య‌త‌ను గుర్తించాల‌ని, ఓటు హక్కును అంద‌రూ వినియోగించుకోవాల‌ని సూచించారు. దేశంలోనే ఏపీని నెం.1 గా చేయ‌గ‌లిగిన చంద్ర‌బాబును ఎన్నుకుంటే మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు అద్భుతంగా ఉంటుంద‌న్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ద‌ర్శి లో మంత్రి సిద్ధారాఘ‌వ‌రావు ఈ ఐదేళ్ల‌లో చేసిన అభివృద్ధి ఒక మ‌చ్చుతున‌క అన్నారు.
సాంబ దొడ్డ మాట్లాడుతూ... మ‌నిషికి ప్రాథ‌మిక అవ‌స‌రాలైన కూడు, గూడు, గుడ్డ అనే విష‌యాన్ని ప‌రిపూర్ణంగా అర్థం చేసుకున్న ప్ర‌భుత్వం ఇది అన్నారు. పేదోడి ఇంటి క‌ల‌ను నెర‌వేర్చిన ప్ర‌భుత్వం ఇది అని, 8 ల‌క్ష‌ల మందికి ఓ గూడు దొరికింది కేవ‌లం చంద్ర‌బాబు ముందు చూపు వ‌ల్లే అని ఆయ‌న పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా అంద‌రి ఆక‌లి తీరుస్తున్న ఈ ప్ర‌భుత్వం మ‌ళ్లీ గెలిస్తే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో వీటిని ఏర్పాటుచేస్తుంద‌న్నారు. ఈ విష‌యంలో ఎన్నారైలు త‌మ‌కు తోచినంత విరాళాలు ఇవ్వాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
జ‌నార్ద‌న్ ఏనిగ‌పాటి మాట్లాడుతూ... పారిశ్రామికీక‌ర‌ణ ఏదో ఒక ప్రాంతానికి ప‌రిమితం చేయ‌కుండా శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు ఎక్క‌డ ఏ ప్రాంతం దేనికి అనుకూలంగా ఉంటే ఆ ప‌రిశ్ర‌మ‌ల‌ను తేవ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృతురాలు అయ్యింద‌ని అన్నారు. గ‌త ఏ ప్ర‌భుత్వాల్లో జ‌ర‌గ‌ని నీటి ప్రాజెక్టుల ప‌నులు ఈసారి జ‌రిగాయ‌ని, స్వ‌యంగా చంద్ర‌బాబే .. త‌న గ‌త పాల‌న కంటే ఈ పాల‌న‌లో ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు చేరామ‌ని చెప్పిన విష‌యాన్ని గుర్తుచేశారు. రాయ‌ల‌సీమ‌కు నీళ్లు అనే క‌ల‌ను నిజం చేయ‌డంతో ల‌క్ష‌లాది ఎక‌రాలు స‌స్య‌శ్యామ‌లం అయ్యాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.
కిర‌ణ్ తుమ్మ‌ల మాట్లాడుతూ కులాలు, ఫ్యాక్ష‌నిస్టుల గొడ‌వ‌ల‌ను అధగ‌మించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ల‌డం అనూహ్య‌మైన విష‌యం అన్నారు. గ‌తంలో వీటి వ‌ల్ల అభివృద్ధి ఆమ‌డ దూరంలో ఉండేద‌ని, చంద్ర‌బాబు అభివృద్ధిని ముందుపెట్టి గొడ‌వ‌ల‌ను వెన‌క్కు నెట్టేశార‌న్నారు. కొన్ని ద‌శాబ్దాలుగా గొడ‌వ‌ల‌తో ర‌గిలిపోతున్న వ‌ర్గాల‌ను ఏకం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కోట్ల‌-కేఈ, దేవినేని-వంగ‌వీటి, ఆదినారాయ‌ణ‌రెడ్డి-రామ‌సుబ్బారెడ్డి ఇలా మ‌నుషుల‌ను క‌లిపే చ‌రిత్ర చంద్ర‌బాబుది అని ఆయ‌న ప్ర‌శంసించారు.
బాలాజీ మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వం యువ‌త‌కు ఎంతో మేలు చేసింద‌ని, వారికి కేవ‌లం నిరుద్యోగ భృతి ఇవ్వ‌డం మాత్రమే కాకుండా... నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ద్వారా వారికి ఉపాధి పొంద‌డానికి అవ‌స‌ర‌మైన స్కిల్స్‌ను నేర్పుతోంద‌న్నారు. ఇక అన్ని ప్ర‌ధాన కులాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటుచేసిన చంద్ర‌బాబు వారి అభివృద్ధికి ఎంతో పాటుప‌డ్డార‌న్నారు.
ఇవ‌న్నీ ప్రజ‌లు గ‌మ‌నించార‌ని, మ‌ళ్లీ అభివృద్ధి నినాదానికే ప‌ట్టం క‌డుతార‌ని ఎన్నారైలు ఆకాంక్షించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా తెలుగుదేశం దిగ్విజ‌యంగా గెలుస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్నారై టీడీపీ డాల‌స్‌, ఎన్టీఆర్ అభిమానులు, ప్ర‌ముఖ ఐటీ పారిశ్రామిక వేత్త‌లు పాల్గొన్నారు.