​పోలీసులను ఆశ్రయించిన మురుగదాస్

August 13, 2020

గజినితో ఓ రేంజ్ కి వెళ్లి స్టార్ డైరెక్టరుగా మారిన మురుగదాస్... ఆ తర్వాత పలు మంచి సినిమాలు తీశారు. ​అంతకుమించి డిజాస్టర్లు కూడా తీశారు. స్పైడర్ సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్స్ నే కాదు తెలుగు ప్రేక్షక లోకం మొత్తాన్ని నిరాశ పరిచారు మురుగదాస్. తాజాగా రజనీలాంటి స్టార్ హీరోని పెట్టుకుని ఆయన తీసిన దర్బార్ పేలవ ప్రదర్శనతో చతికిల పడింది. ఈ నేపథ్యంలో మురుగుదాస్ తో పాటు రజినికి కొత్త చిక్కు వచ్చి పడింది. 

దర్బార్ డిస్ట్రిబ్యూటర్లు తాము చాలా నష్టపోయాం అంటూ రజనీకాంత్ ను కలవడానికి వెళ్లారు. అయితే... ఎపుడూ లేని విధంగా వారు గేటు దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. అప్పాయింట్ మెంట్లు లేవంటూ రజనీకాంత్ ఇంటి వద్ద పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వలేదు. వాస్తవానికి వారు వస్తున్నట్టు ముందుగానే సమాచారం తెలుసుకుని భద్రత ఏర్పాటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పంపిణీ దారులు ఊహించలేదు. అయితే... వారు అక్కడితో ఆగలేదు. దర్శకుడు మురుగదాస్ మా నష్టానికి ప్రధాన కారకుడు అంటూ ఆయన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారట.

విషయం తెలుసుకున్న మురుగదాస్ బాబూ మాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసు స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కారు. మద్రాసు హైకోర్టు దీనిపై స్పందిస్తూ...పోలీసులు రక్షణ అవసరాన్ని పరిశీలించాలని సూచించింది.  అయినా.. మరీ ఇంత పేలవంగా తీయడం ఎందుకు? తప్పుల నుంచి గుణపాఠాలు మురుగదాస్ ఎందుకు నేర్చుకోవడం లేదు? మరో వైపు ఎక్కువ లాభాలు వస్తే నిర్మాత, దర్శకుడు, హీరోకు పంపిణీ దారులు డబ్బులు ఇవ్వరు. అలాంటపుడు ఎందుకు నష్టపోతే డబ్బులు అడుగుతారో మరి?