పబ్లిసిటీ : ఆయన్ని అడ్డంగా వాడేసుకుంటున్నారు

August 14, 2020

డౌన్ టైంలో ఆటలన్నీ బంద్ అయిపోవడంతో క్రికెటర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఐతే మిగతా క్రికెటర్ల మాటేమో కానీ.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ దృష్టి మాత్రం టిక్ టాక్‌పై వీడియోలపై పడింది.

అందులోనూ అతను ఇండియన్ సినిమాల మీద ఫోకస్ పెట్టి వీడియోలు చేస్తుండటం విశేషం. తన కూతురితో కలిసి షీలాకీ జవానీ పాటకు డ్యాన్స్ చేయడంతో మొదలుపెట్టి.. ఇప్పుడు ‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబు డైలాగును ఇమిటేట్ చేసే వరకు వచ్చేశాడు వార్నర్. 

ఈ మధ్యనే వార్నర్ తన భార్య, కూతురితో కలిసి ‘బుట్టబొమ్మ’ పాటకు వేసిన స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో రోహిత్ శర్మతో మాట్లాడుతూ.. టాలీవుడ్ గురించి, బుట్టబొమ్మ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు వార్నర్.

ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన వార్నర్.. ఇప్పుడు తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియోలతో మరింతగా మన జనాల మనసుల్లోకి చొచ్చుకుపోతున్నాడు. 

‘పోకిరి’లో ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే మహేష్ డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే. ఆ డైలాగును వార్నర్ తనదైన శైలిలో ఇమిటేట్ చేశాడు. బ్యాట్ చేతబట్టి సీరియ్‌గా డైలాగ్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడం ఆలస్యం వైరల్ అయిపోయింది.

దీనిపై పూరి జగన్నాథ్ సైతం స్పందించాడు. వార్నర్ దూకుడుకు చక్కగా సరిపోయే డైలాగ్ ఇదన్నాడు. వార్నర్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడని కితాబిచ్చాడు. బ్యాటింగ్ విషయంలో వార్నర్ దూకుడు సంగతి తెలిసిన వాళ్లందరూ.. ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగ్ అతడికి పర్ఫెక్ట్‌గా సూటవుతుందని కామెంట్ చేస్తున్నారు.  

కొసమెరుపు - ఏంటంటే... అసలే క.రో.నా. కారణంగా జనం ఐపీఎల్ ని మరిచిపోయేలా ఉన్నారని... కోట్లు పెట్టి కొనుక్కున్న క్రికెటర్లను అలా వదిలేయడం కంటే ఇలా పబ్లిసిటీ అయినా చేసుకుందాం అని సన్ రైజర్స్ ఆలోచించి ఇలా వాడుకుంటుందేమో అన్న వాదన కూడా వినిపిస్తోంది.