డీల్ ఓకే...డిప్యూటీ సీఎం ప‌ద‌వికి అజిత్ రాజీనామా

June 01, 2020

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ప‌రిణామం చోటు చేసుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో...బీజేపీకి మ‌ద్ద‌తిచ్చి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన ఎన్‌సీపీ నేత అజిత్ ప‌వార్‌....త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేప‌టికే...ఆయ‌న త‌న ప‌ద‌విని వీడారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని అజిత్‌ పవార్‌పై ఎన్సీపీ నేతలు ఒత్తిడి తీసుకురావ‌డం, చిన్నాన్న, ఎన్‌సీపీ వ్య‌వ‌స్థాప‌కుడు శ‌ర‌ద్ ప‌వార్ కీల‌క ఆఫ‌ర్ ఇచ్చిన నేప‌థ్యంలో...అజిత్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఎన్‌సీపీ మరియు పార్టీ అధక్షుడు శరద్ పవార్‌ను కాదని త‌నతో పాటు వచ్చిన 32 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అజిత్‌పవార్  ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ ఫ‌లితంగా ఆయ‌న ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పొందారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ పార్టీకి తీరని అన్యాయం చేశాడని వారు ఆరోపించారు. ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని బీజేపీ, అజిత్ పవార్ బృందంపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మండిపడ్డాయి. గవర్నర్ జీజేపీకి తొత్తుగా మారారని ఆయా పార్టీలు ఆరోపించాయి.జీజేపీ గూటికి చేరిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌ను పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఎన్‌సీపీ తొలగించింది. శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. అజిత్‌కు బదులు ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా జయంత్ పాటిల్‌ను ఎన్నుకున్నారు.

రాజ‌కీయంగా అజిత్ ప‌వార్‌పై చేసిన ఒత్తిడి ప‌లితం ఇవ్వ‌క‌పోవ‌డంతో...కుటుంబ సభ్యుల ద్వారా అజిత్‌ పవార్‌పై శరద్‌ పవార్‌ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని స‌మాచారం. పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీకి మద్దతు ప్రకటించినప్ప‌టికీ...అజిత్‌పవార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయ‌లేద‌ని ఆయ‌న తెలిపార‌ని, ఇప్ప‌టికైనా పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఎన్సీపీ అధినేత సూచ‌న‌లు ఇవ్వ‌డంతో...అజిత్ మ‌న‌సు మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ఇదిలాఉండ‌గా, ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మీడియా ముందుకు రానున్నారు. బలపరీక్ష కంటే ముందే కూడా తన పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.