దీపిక ధైర్యం.. ఆమె సినిమాకు సంక‌టం

August 07, 2020

ప్ర‌తిపాదిత పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంలు మీద ఇప్పుడు దేశం రెండుగా చీలిపోయి ఉంది. దీనిపై దేశ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో ర‌గ‌డ న‌డుస్తోందో తెలిసిందే. ఈ చ‌ట్టాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న జేఎన్‌యూ విద్యార్థుల మీద ఇటీవ‌ల జ‌రిగిన మూక‌ దాడి ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. దీన్ని ఓ వ‌ర్గం బాలీవుడ్ సెల‌బ్రెటీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. చాలామంది దీనిపై త‌మ అభిప్రాయం చెప్ప‌డానికి.. స్టాండ్ తీసుకోవ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే పెద్ద సాహ‌సం చేసింది. త‌న కొత్త చిత్రం చ‌పాక్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఆమె జేఎన్‌యూలోకి అడుగుపెట్టి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

జేఎన్‌యూలో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు దీపిక‌ బుధవారం రాత్రి వర్సిటీని సందర్శించింది. రాత్రి 7.30 గంటల సమయంలో క్యాంపస్‌లో బహిరంగ సభ జరుగుతుండగా విచ్చేసిన దీపికా.. దాదాపు 15 నిమిషాల పాటు అక్కడే ఉంది. ఆమె ఏమీ మాట్లాడ‌లేదు కానీ.. అక్క‌డికి రావ‌డంతోనే బాధితుల‌కు సంఘీభావం ప్ర‌క‌టిస్తూ దాడిని ఖండించిన‌ట్ల‌యింది. జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ను పరామర్శించిన తర్వాత దీపిక‌ కొందరు విద్యార్థి సంఘం నేతలతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. దీపిక సందర్శనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఐతే దీపిక‌ జేఎన్‌యూని సందర్శించి వెళ్లిన కొద్ది సేపటికే భాజపా నేత తేజేందర్‌పాల్‌ సింగ్‌ బగ్గా స్పందించాడు. దీపిక సినిమాను బహిష్కరించాల‌ని పిలుపునిచ్చాడు. ఈ నేప‌థ్యంలో చ‌పాక్ రిలీజ్ స‌మ‌యంలో ఇబ్బందులు త‌ప్ప‌వేమో అన్న ఆందోళ‌న నెల‌కొంది.