జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్లక తప్పదా?

August 06, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ... మళ్లీ ఢిల్లీ టూరు పెట్టుకోక తప్పేలా లేదు. ప్రజలు సుపరిపాలన కోరుకుని, ప్రపంచమంతా యువ నాయకత్వాన్ని కోరుకుంటున్న నేపథ్యంలా ఒక్క ఛాన్సిస్తే అదరగొడతా అని జగన్ పదేపదే అడిగితే ఒక్క ఛాన్సిచ్చారు. కానీ దానిని సద్వినియోగం చేయాల్సిన ముఖ్యమంత్రి జగన్... తన వ్యక్తిగత శత్రువు అయిన చంద్రబాబు మీద పైచేయి సాధించడానికి మాత్రమే తన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. చంద్రబాబును డ్యామేజ్ చేయడానికి తన తన పవర్ ను వాడుతున్నాడు. సంపద సృష్టికి, ఏపీ రేటింగ్స్ పెంచడానికి, ఉపాధి కల్పనకు, ఉద్యోగ కల్పనకు, పెట్టుబడుల ఆహ్వానానికి గత ఆరునెలల్లో జగన్ సర్కారు చెప్పుకోదగ్గ చర్యలు తీసుకోలేదు. వీటన్నింటికి మించి ఇతర పార్టీల్లో ఉన్న చోటామోటా నాయకులు తన పార్టీలో చేరేలా తన పార్టీ నేతలు వ్యవహరిస్తుంటే, ఇతర పార్టీల వారిని బెదిరిస్తుంటే... ముఖ్యమంత్రి అయిఉండి వారిని వారించలేదు, అడ్డుకోలేదు, దండించలేదు. వైసీపీ నేతల వేధింపులకు టీడీపీ మాత్రమే కాదు, జనసేన, బీజేపీ పార్టీలు కూడా బాధితులే. 

తెలుగుదేశం, జనసేన అధినేతలు... ఏపీలోనే జగన్ పై బహిరంగ పోరాటాలకు దిగారు. వైకాపా నియంత్రుత్వాన్ని అరాచకాలను ఎండగట్టారు. బీజేపీ నేతలు వైకాపా వేధింపులు తట్టుకోలేక ఏకంగా బీజేపీలో కీలక వ్యక్తి, హోంమంత్రి అయిన అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కడప చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ వాళ్లు ఎలా దాడిచేసిందీ ఆధారాలతో సహా అమిత్ షాకు అందజేశారు. బీజేపీ అధికార ప్రతినిధి కిలారు దిలీప్, రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు  రమేష్ నాయుడు తదితరులు రాష్ట్రంలో వైకాపా వేధింపుల తీరు గురించి అమిత్ షాకు పూసగుచ్చినట్టు వివరించారు. ఆధారాలు సమర్పించారు. పోలీసు స్టేషన్లు వైకాపా కార్యాలయాలు అయిపోయాయని... వారు అమిత్ షాకు వివరించినట్లు తెలిసింది. 

ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పిలుపు రావచ్చని అంటున్నారు. ఇటీవలే జగన్ అమిత్ షాను కలవడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. జగన్ అపాయింట్మెంట్  ను కారణం చెప్పకుండా అమిత్ షా రద్దు చేసుకున్నారు. దీంతో తాజా ఫిర్యాదులతో పిలిచి గట్టి గా మందలించే అవకాశం కనిపిస్తోందని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. తెలుగుదేశం నేతలు కూడా జగన్ తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా... వైకాపా మద్దతు దారులను తప్ప ఇతరులపై అన్యాయంగా కేసులు పెడుతున్నట్లు బాధితులు బహిరంగ వేదికలపైనే చెప్పారంటే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.