మోడీషాలకు పరీక్ష.. మోగిన ఢిల్లీ ఎన్నికల నగారా

August 03, 2020

మొన్ననే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో.. ఇప్పుడు మరో రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించారు.
ఈ ఏడాది జరుగుతున్న తొలి ఎన్నికలుగా వీటిని చెప్పాలి. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహిస్తామని.. ఫలితాల్ని ఫిబ్రవరి 11న వెల్లడిస్తామని ఈసీ పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించనున్నారు. 13,750 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏమంటే.. దేశంలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో.. ఓటుహక్కు వినియోగించుకోని వారు తమ గైర్హాజరీని గుర్తించేందుకు వీలును కల్పించారు.దీంతో.. ఓటు వేయని వారు.. తాము ఓటు వేయని విషయాన్ని  గుర్తించే వీలుంది. అనారోగ్యం కారణంగా.. అనివార్య కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించని వారికి ఇది లాభంగా మారుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో చారిత్రక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. తర్వాత ఆయన ప్రతికూలతలు ఎదుర్కొన్నా.. మరోసారి అధికారాన్ని చేపట్టారు. మొత్తంగా చూస్తే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే కూడా మోడీషాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపే వీలుందంటున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పెట్టి పవర్ కోల్పోతున్న వేళ.. విపక్షంగా ఉన్న ఢిల్లీలో తన బలాన్ని బీజేపీ పెంచుకోగలుగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతుందని చెప్పాలి.