దేశ రాజధానిలో దారుణం.. 

June 02, 2020

వీకెండ్ వేళ.. దారుణమైన విషాదం దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని రాణిఝూన్సీలోని అనాజ్ మండీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున చెలరేగిన మంటలతో ఊపిరి ఆడక ఇప్పటివరకూ 43 మంది మృతి చెందారు.
ఒక బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో ఇంత భారీగా మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదం నుంచి ఇప్పటివరకూ 50 మంది వరకూ కాపాడారు అగ్నిమాపక అధికారులు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు 30 ఫైరింజన్లు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి.
మృతుల్లో ఎక్కువమంది ఫైర్ యాక్సిడెంట్ కారణంగా అలుముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరి అయి.. ఊపిరి ఆడని పరిస్థితుల్లో మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ భారీ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా తేల్లేదు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంటల తీవ్రత.. తదనంతర పరిణామాల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వీకెండ్ వేళ దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ ఘోర అగ్నిప్రమాదం ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. నిద్ర మత్తు వీడేలా చేస్తోంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసుల విచారిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున చోటు చేసుకున్న ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది తేల్చే ప్రయత్నం చేస్తున్నారు.