వైసీపీకి షాక్ ... ఢిల్లీ నుంచి నోటీసులు !

August 13, 2020

రఘురామరాజుకు భయంభయంగా ఒక షోకాజ్ నోటీసు ఇస్తే... అది పెంటపెంట చేశాడు రాజుగారు. అసలు రాజుగారి లెక్కల్లో తాను గెలిచిన పార్టీ నుంచి తనకు షోకాజ్ నోటీసు రాలేదు కాబట్టి తనకు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే ఒక ఘాటు రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ అనేది మన పార్టీ కాదు కదా... మన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కదా అని రిప్లై ఇస్తూ... ఈ పార్టీ ఇంకో పేరు ఎలా వాడుతుంది అంటూ ఈసీ వద్ద పెంటపెట్టాడు. అదింకా పెండింగ్లో ఉంది. రాజు గారి రిప్లైకి వైసీపీ పెద్దలకు చుక్కలు కనిపించి చమటలు పట్టాయి. ఇంతలో అంతవరకు ఈ ఐడియా రాని అసలు వైసీపీ నేత ప్పందించారు.

 యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు తన పార్టీ పేరు అయిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని తన అనుమతి లేకుండా వాడుతున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి  అన్నవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈయన రఘురామరాజుకు మంచి ఫ్రెండు అట. అదింకో ట్విస్టు. 

ఇక వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని మహబూబ్ బాషా కోరారు. అంతటితో ఆగకుండా వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల కమిషన్ తో పాటు వైసీపీకి కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిషన్ తదుపరి విచారణను సెప్టంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. మొత్తానికి కోర్టు శానా టైం ఇచ్చింది. దీంతో రాజీ చేసుకోవడానికి వైసీపీకి కొంత సమయం దొరకడం ఒక పెద్ద ఊరట.

ఇంతకీ అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు   మహబూబ్ బాషా వాదన ఏంటంటే... వైకాపా అధికార పత్రాలపై యువజన శ్రామిక పార్టీ అని పూర్తి పేరు రాయడం లేదని, వైఎస్సార్ అని తమ పార్టీని ప్రతిబింబించేలా రాస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ఆధారంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుతో పలు ఇతర  ఆధారాలను అతను కోర్టుకు సమర్పించారు. పిటిషనరు ఏకంగా ఢిల్లీ కోర్టుకు వెళ్లి పిటిషను వేయడం సాధారణ విషయం కాదు.