ఏపీ, తెలంగాణ సీఎంలకు కొత్త తలనొప్పి

August 12, 2020

మార్చి 14న ఢిల్లీలో జరిగన జమాత్ సభకు వెళ్లొచ్చిన వారు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇపుడు కలకలం సృష్టిస్తున్నారు. మొన్న మేము ముందే రాసినట్లు ‘‘తెలంగాణలో తొలి మరణం వెనుక భయంకర నిజాలు’’ ఇపుడు వెలుగుచూస్తున్నాయి. ఒక వ్యక్తి కరోనా సింప్టమ్స్ తో ఆస్పత్రికి వస్తే అతను మరణించే వారకు అతనికి కరోనా పరీక్ష కూడా చేయలేదు ఆ దుర్మార్గపు ఆస్పత్రి. ఇంతకీ అతనికి కరోనా ఎలా సోకిందబ్బా అంటే... ఢిల్లీలో జరిగిన సభలకు అతను హాజరయ్యాడు. అతనే కాదు... దేశంలో నలుమూలల నుంచి ఆ సభకు చాలామంది హాజరయ్యారు. ఒక్క ఏపీ తెలంగాణలోనే వందకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది.

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ లక్షణాలు బయటపడటంతో వారికి ఎలా సోకిందని ఆరా తీయగా... ఢిల్లీ జమాత్ సభకు వెళ్లొచ్చామని చెప్పారు. విజయనగరం, పశ్చిమగోదావరి, అనంతపురం ఇలా చాలా జిల్లాల నుంచి కూడా వెళ్లారు. తెలంగాణలో నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి ఆ సభకు పెద్ద సంఖ్యలో వెళ్లొచ్చారు. వీళ్లు రైల్లో ప్రయాణించి స్వస్థలాలకు చేరుకున్నారు. వీరి వల్ల ఎంత మందికి సోకిందన్న భయం ఇపుడు ఇండియాకు పట్టుకుంది. వీటికి వెళ్లొచ్చిన కుటుంబ సభ్యులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్ కి తరలించాయి. ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే తెలంగాణలో 40 మంది ఈసభలకు వెళ్లొచ్చారంటే అది సంచలనం అయ్యింది. 

తాజాగా ఏపీలో కేసుల సంఖ్య 23కి చేరింది. తెలంగాణలో ఈ సంఖ్య 70కి చేరింది. మరో వారం గడిస్తే గాని వాస్తవ పరిస్థితులు ఏంటనేది అర్థం కావు. ఒక మాటయితే నిజం.. మార్చి 1వ తేదీ నాటికే వైరస్ ఇండియాలో ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రయాణాలు చేసిన వారు తమంతట తాము లక్షణాలు తెలుసుకుని బాధ్యతగా ఆస్పత్రికి వెళ్తే ఈ దేశాన్ని కాపాడిన వారు అవుతారు.