ప్రధాన మంత్రి పెళ్లి మళ్లీ వాయిదా పడింది

August 13, 2020

పాలకుల కమిట్ మెంట్ ఎలా ఉండాలన్న దానికి మనోళ్లు చెప్పే ఉదాహరణలకు ఇప్పుడు చెప్పే దానికి అస్సలు పోలికే ఉండదు. దేశం కోసం అహరహం శ్రమించే దానికి మనోళ్లు ఇచ్చే నిర్వచనాలు వేరుగా ఉంటాయి. ప్రాశ్చాత్య దేశాల్లోని కొందరు పాలకుల తీరు చూస్తే..ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎక్కడి దాకానో ఎందుకు డెన్మార్క్ ప్రధాని మిట్టే ఫ్రెడ్రిక్ సన్ ను చూస్తే ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా ఆమె ఐరోపా సమాఖ్య సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. కానీ.. అదే రోజు ఆమె పెళ్లి పెట్టుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని.. వేర్వేరు కారణాలతో వాయిదా పడింది. ముచ్చటగా మూడోసారి డేట్ ఫిక్స్ చేసుకున్న వేళ.. కీలకమైన సదస్సుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు వేరే వారిని పంపటం చేస్తారు. కానీ.. డెన్మార్క్ ప్రధాని మాత్రం భిన్నంగా తన పెళ్లిని వాయిదా వేసుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

 

మాయారి రోగం అంతకంతకూ చెలరేగిపోతున్న వేళ ఒకసారి.. లాక్ డౌన్ కారణంగా మరోసారి ఆమె పెళ్లికి అడ్డుగా మారాయి. తాజాగా.. మరోసారి ఆమె దేశం కోసం.. దేశ ప్రయోజనాల కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి ఎంతో కాలంగా వేచి చూస్తున్నానని.. ఇతనే నా కాబోయే భర్త అంటూ తనతో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేశారు.

పెళ్లి విషయంలో తనకు కాబోయే భర్త ఎంతో ఓపిగ్గా ఎదురుచూశారని.. త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని ఆమె పేర్కొన్నారు. వెయిట్ చేయటం అంత సులువైన విషయం కాదని.. డెన్మార్క్ ప్రజల ప్రయోజనాల్ని కాపాడే కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన వేళ.. పెళ్లిని వాయిదా వేసుకోవాలని ఆమె డిసైడ్ అయ్యారు.

ఇలాంటి నేతలు ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తారేమో? అదే మన దగ్గర అయితే.. ఎలాంటి సీన్ ఉండేదో ఒక్కసారి ఊహించకుంటే డెన్మార్క్ ప్రధాని గొప్పతనం ఇట్టే అర్థమైపోతుంది.