వైసీపీలో వల్లభనేని వర్సెస్ దేవినేని?

July 09, 2020

కృష్ణా జిల్లా వైసీపీలోకి దేవినేని అవినాశ్ చేరడం... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి జై కొట్టడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు వైసీపీలో ఎలా ఇముడుతారు.. ఇద్దరూ వైసీపీని ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తారన్నది చర్చనీయంగా మారింది. ఈ ఇద్దరు నేతల నేపథ్యం చూస్తే సామాజికవర్గంపరంగా ఒకటే అయినప్పటికీ ఇద్దరూ రెండు భిన్న నేపథ్యమున్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడు ఈ ఇద్దరూ గత కొద్దికాలంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులు వేరు. కానీ, ఇప్పుడు వైసీపీలో ఈ రెండు కత్తులు ఎలా ఇముడుతాయన్న ప్రశ్న మొదలైంది.
దేవినేని అవినాశ్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూ, వల్లభనేని వంశీల మధ్య గతంలో కొంతకాలం తీవ్ర వివాదం నడిచింది. ఇద్దరు నేతల అనుచరుల మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. దేవినేని నెహ్రూను వంశీ ముసలి రౌడీ అంటూ హేళన చేస్తే... వంశీని బచ్చా అని, ఆకు రౌడీ అని దేవినేని నెహ్రూ ఎద్దేవా చేసేవారు. ఆ తరువాత నెహ్రూ టీడీపీలోకి వచ్చారు.. అయినా, వంశీ, నెహ్రూ మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు. అలాగే నెహ్రూ మరణం తరువాత ఆయన కుమారుడు అవినాశ్‌కు టీడీపీ టికెట్ ఇచ్చింది, ఆయన ఓడిపోయారు. అయితే, ఈ దశలోనూ వంశీ, అవినాశ్‌ల మధ్య కూడా ఎన్నడూ సఖ్యత లేదు.
చంద్రబాబు వీరిద్దరికీ సమ ప్రాధాన్యమిస్తూ ఒకరి ఏరియాలో ఒకరు ఎంటర్ కాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేశారు.. చంద్రబాబంటే ఉన్న ఒక రకమైన భయం వల్ల కూడా ఈ ఇద్దరూ అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా టీడీపీలో ఉన్నంత కాలం ఎవరిదారిన వారు సాగిపోతూ కథ నడిపించారు. కానీ, ఇప్పుడు ఇద్దరూ వైసీపీ పంచన చేరడంతో ఇక్కడ అలానే ఉంటారా? లేదంటే పాత గొడవల నేపథ్యంలో ఆధిపత్య పోరాటాలకు దిగుతారా అన్నది చూడాలి.
పైగా వైసీపీలో మంత్రిగా ఉన్న కొడాలి నాని చేతిలోనే అవినాశ్ ఓటమి పాలయ్యారు. అదే నానితో వంశీకి బలమైన స్నేహ సంబంధాలున్నాయి. పేర్ని నానితోనూ వంశీకి గట్టి దోస్తీ ఉంది. ఇలా.. వైసీపీలో కీలక మంత్రులతో మంచి స్నేహ సంబంధాలున్న వంశీని అవినాశ్ ఎదుర్కోగలడా అన్నది సందేహంగా మారింది. అవినాశ్ అనుచరుల్లోనూ ఇదే సందేహాలున్నట్లు వినిపిస్తోంది. 

Read Also

జ‌గ‌న్ నీతి వాక్యాలకు శుభం కార్డు పడింది
కూడుపెట్టేది నైపుణ్యమే...ఇంగ్లీషు కాదు...
తెలంగాణా  ఐక్య వేదిక  అఖిలపక్షము యూకే (లండన్)