’పోకిరి సీన్ - ఏం జగన్ ఎంతకమ్మేశావు పోర్టుని‘

May 26, 2020

తెలుగుదేశంలో వాగ్దాటి కలిగిన నేతల్లో దేవినేని ఉమ ఒకరు. ఆయన గత ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖను నిర్వహించారు. ఆయనపై గతంలో ప్రతిపక్షం పలు ఆరోపణలు చేసింది. అయితే, గత ప్రభుత్వం హయాంలోనే పట్టిసీమ వల్ల కృష్ణా జిల్లాకు సమయానికి నీరు వస్తోంది. రాయలసీమలో చివరి ప్రాంతం అయిన చిత్తూరు జిల్లాదాకా కూడా నీరు ఇచ్చారు. అయినా... వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా... ఈరోజు అమరావతిలో దేవినేని ఉమ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోకిరి సినిమాలో మహేష్ శృతి నాదే, రివాల్వర్ నాదే అన్న స్థాయిలో జగన్ పై విరుచుకుపడ్డారు.
ఏం జగన్ రెడ్డి బందరు పోర్టును తెలంగాణ సార్ కు ఎంతకు అమ్మేశావు? గత అసెంబ్లీ ఎన్నికల్లో నీకు 1500 కోట్లు అక్కడి నుంచి అందాయటగా. దానికి క్విడ్ ప్రో కో గా బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేశావా? అన్నట్లు దేవినేని ఉమ వ్యాఖ్యానిస్తూ ఆరోపణలు చేశారు. వైసీపీ రాగానే పోర్టులో ఉన్న యంత్రాలు వెళ్లిపోయాయయి అని విరుచుకుపడ్డారు.
బందరు పోర్టుకు సంబంధించి జగన్ అన్నీ రహస్యంగా చేస్తున్నారు. రహస్య జీవోలను బయటపెట్టు అంటూ ఉమతో పాటు ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు పోర్టుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పస్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బెదిరింపుల వల్ల నిర్మాణ పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ వెనక్కి పోయే ప్రమాదం ఉందని కొల్లు రవీంద్ర ఆరోపించారు.