అధికార మార్పిడిపై దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు

April 06, 2020

2019లో ఎన్నికల్లో 175 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలవడం, అమరావతి-వికేంద్రీకరణ వంటి అంశాలతో వైసీపీ ప్రభుత్వం ప్రాంతాలవారీగా టీడీపీ నేతల్లో అసంతృప్తి లేదా విభజన తీసుకు రావడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో టీడీపీకి కష్టమేననే వాదనలు వినిపించాయి. పోటీ మూడు పార్టీల మధ్య ఉంటుందంటే.. కాదు కాదు, వైసీపీ-జనసేన మధ్యే ఉంటుందని, టీడీపీ పని అయిపోయిందని చెప్పిన వారూ ఉన్నారు.

కానీ తాజాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి. చంద్రబాబును ఉద్దేశించి కడుపు మంటకు మందు లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు దేవినేని కౌంటర్ ఇచ్చారు. కడుపు మంటకు మందు లేదని జగన్ అంటున్నారని, కానీ పైశాచిక ఆనందం పొందేవారికి కూడా మందుల్లేవని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

ఎదుటివారు ఎడుస్తుంటే ఆనందపడేవారికి ఆరోగ్యశ్రీలో కూడా మందుల్లేవని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక పైశాచిక ఆనందం పొందేవారికి మందులు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ  వర్సెస్ జనసేనగానే ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం. జనసేనకు బీజేపీ కూడా తోడయింది. గత ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కూడా వైసీపీకి మరలింది. ఈ కారణంగానే ఆ పార్టీ ఏకంగా 175 సీట్లు గెలుచుకుందని చెబుతారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు జనసేనానికి మరలింది.

మూడు రాజధానులతో టీడీపీలోనే చిచ్చు తీసుకు వచ్చింది వైసీపీ ప్రభుత్వం. జగన్ నిర్ణయానికి అనంతపురం, ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్నారు. పార్టీలో ఉంటూనే బాహాటంగా జగన్ నిర్ణయం సరైనదే అంటున్నారు. మరోవైపు, టీడీపీ నుండి నేతలు ఖాళీ అవుతున్నారు. ఓ వైపు వైసీపీ అధికారంలో ఉండటం, బీజేపీ కలయికతో జనసేనకు అదనపు బలం వచ్చాయి. టీడీపీ బలం రోజురోజుకు తగ్గుతోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో దేవినేని ఉమ తాము అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్పడం గమనార్హం. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ అధికారం తమదేనని ఇప్పటి నుండే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు మరో నాలుగేళ్లకు పైగా ఉందని, అప్పటి వరకు పరిస్థితులు మారిపోతాయని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు.