అసెంబ్లీలో ధర్మాన మొసలి కన్నీరు వెనుక అంత కథ ఉందా?

February 26, 2020

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసినంత కాలం కీలకంగా వ్యవహరించడంతో పాటు కన్నెధార కొండ వంటి పలు వివాదాల్లోనూ చిక్కుకున్న ధర్మాన ప్రసాదరావు 2019 ఎన్నికల్లో గెలిచినా జగన్ మంత్రివర్గంలో స్థానంలో దక్కించుకోలేకపోయారు. దీంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన అసెంబ్లీలోనూ ఇంతవరకు పెద్దగా గళం వినిపించలేదు. కానీ, శీతాకాల సమావేశాల చివరి రోజున మాత్రం ఆయన సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా అన్యాయమైపోతుందంటూ గళమెత్తిన ఆయన ప్రభావంతో చివరకు స్పీకరు కూడా తాను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాల్సిన బాధ్యత ఉందంటూ శ్రీకాకుళం వెనుకబాటుతనంపై ఆయనా మాట్లాడారు.  ధర్మాన తన ప్రసంగంలో ప్రధానంగా గత చంద్రబాబు పాలనను టార్గెట్ చేశారు. విభజన తరువాత ఏపీకి 23 కేంద్ర సంస్థలు వస్తే అందులో ఒక్కటి కూడా శ్రీకాకుళానికి కేటాయించలేదని ఆయన ఆరోపించారు.
అయితే... ఇంతకాలం కామ్‌గా ఉన్న ధర్మాన ఇప్పుడు ఈ అంశం లేవనెత్తడంపై స్థానికంగా అనేక వాదనలు మొదలయ్యాయి. రాజకీయంగా, మంత్రిగా ఎంతో అనుభవం ఉన్నా జగన్ కేబినెట్లో బెర్తు దొరకని ఆయన దాన్ని కాంపన్షేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారని.. శ్రీకాకుళానికి ఏదైనా ఒక కేంద్ర సంస్థను మంజూరు చేయించుకోవడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణానికి సమీపాన గల ఒక గ్రామంలో నాగావళి నది ఒడ్డున ఆయన కొద్దికాలంగా భారీగా భూములను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అక్కడే ప్రభుత్వ భూములూ కొంత ఉండడంతో ఏదైనా సంస్థను అక్కడ ఏర్పాటు చేయించుకుంటే భూముల ధరలకు రెక్కలు వస్తాయని.. శ్రీకాకుళం పట్టణం సమీపాన అవి ఉండడంతో పాటు ఆ గ్రామాన్నికూడా త్వరలో శ్రీకాకుళం కార్పొరేషన్లో కలపనుండడంతో తన భూముల పక్కనే కేంద్ర సంస్థ వస్తే లాభపడాలన్నది ఆయన వ్యూహమని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే కలుగులోంచి బయటకు వచ్చి ఇప్పుడు శ్రీకాకుళం వెనుకబాటుతనం గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని చెబుతున్నారు. ఆయన సుదీర్ఘ కాలం మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.