దూల తీర్చిన దూల్ పేట... తప్పు పోలీసులదేనా?

June 02, 2020

నిబంధనలు ఎన్ని ఉంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? దాన్నిపాటించేవాళ్లు ఉండాలి. లేదంటే.. పక్కాగా అమలు చేసే వారైనా ఉండాలి. అందుకు భిన్నంగా రూల్స్ పెడతాం.. పాటిస్తారా? లేదా? అన్నది మీ ఇష్టం అన్న చందంగా వదిలేస్తే ఎలాంటి పరిస్థితి అన్నది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది. మాయదారి రోగం అంతకంతకూ వ్యాప్తిస్తున్న వేళ.. కఠినమైన నిబంధనల్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. వాటిని అమలు చేసే విషయంలో కొన్నిచోట్ల లోటుపాట్లు జరిగి.. మిగిలిన వారందరికి ముప్పుగా మారే పరిస్థితి.
హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో చట్టాలు ఉంటాయే తప్పించి.. వాటిని అమలు చేసే విషయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి తీరుతో ముంచుకొచ్చే ముప్పు తీవ్రత ఎంతన్న విషయం తాజా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. లాక్ డౌన్ వేళ.. ఒకేచోట ఎక్కువమంది గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి లేదు.
పెళ్లికి యాభై మంది..చావుకు పది మందికి మాత్రమే అనుమతి ఉంది. ఎంగేజ్ మెంట్ లాంటి కార్యక్రమాలు అయితే.. పది లేదంటే ఇరవైకి మించకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. కానీ.. అందుకు భిన్నంగా ఈ నెల 11న ధూల్ పేటలో ఒక ఎంగేజ్ మెంట్ నిర్వహించారు. ధూంధాంగా జరిగిన ఈ కార్యక్రమానికి 300 మంది వరకూ హాజరైనట్లు చెబుతున్నారు. సాధారణంగా ధూల్ పేటలో జరిగే చాలా విషయాలు అంత త్వరగా బయటకు రావు. తాజా ఎంగేజ్ మెంట్ వివరాల పరిస్థితి కూడా అంతే.
ఈ కార్యక్రమం ధూంధాంగా పూర్తి చేసిన తర్వాత పెళ్లికొడుకు తండ్రి అస్వస్థతకు గురయ్యాడు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో.. ఆ కుటుంబానికి.. కొందరు బంధువులకు పరీక్షలు చేయగా వారిలో 15 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే.. ఎలా అంటుకుందన్న విషయంపై ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. నిశ్చితార్థానికి హాజరైన వారి జాబితాను తయారు చేస్తున్న అధికారులకు షాకింగ్ గా మారింది.

ఇరవై మందికి మించి నిర్వహించే అవకాశం లేని కార్యక్రమానికి 300 మంది హాజరు కావటంపై విస్మయం వ్యక్తమవుతోంది.ఓవైపు వేడుక నిర్వహించిన ఇంటి పెద్ద మరణం బాధ ఒకటైతే.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన విందుపై పోలీసులు ఆరా.. పదిహేను మంది వరకూ పాజిటివ్ తో పాటు.. దీనికి హాజరైన వారిలో మరెందరికి వ్యాపిస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.  

ఇదంతా ఒకెత్తు అయితే.. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా పోలీసులకు సమాచారం లేదా? ఉన్నా పట్టించుకోలేదా? ఒకవేళ వెళ్లినా రాజకీయ ఒత్తిడి ఏమైనా పనిచేసిందా? స్థానిక పోలీసులు కొందరు ఆమ్యామ్యా వల్ల ఏమైనా పొరపాటు చేశారా??? ఇలా అనేక అనుమానాలు దీని చుట్టు తిరుగుతున్నాయి. కనీసం జనం అయినా 100 కు డయల్ చేయలేదా? ఇంత పెద్ద ఫంక్షను చేస్తుంటే? అన్నది విచిత్రంగా ఉంది.

ఇక ఈ వార్తపై అత్యధిక నెటిజన్లు చేసిన కామెంట్ ఏంటో తెలుసా?...

‘‘ఫంక్షను పిలిచినోడికి బద్ధి లేకపోతే వెళ్లినవాడికయినా బుద్ధి ఉండద్దా’’

నిజమే కదా... ఎవడి ప్రాణాలు వాడికి తీపి. పిలిచే వాడు పిలుస్తాడు. వెళ్లే వాడికి భయం లేకపోతే ఎలా?